గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ప్రజారోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై పూర్తి స్థాయిలో నిషేధం అమలులో ఉందని, ప్లాస్టిక్ నిషేదంపై ప్రజారోగ్య అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు నిరంతరం క్షేత్ర స్థాయిలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై ‘స్వచ్ఛ యాప్’ ద్వారా తక్షణమే అపరాధ రుసుం విధించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే నష్టం తెలుసుకొని సహకరించాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గత నెల రోజులుగా నగరవ్యాప్తంగా ప్రచార సాధనాలు మరియు సచివాలయాల పరిధిలో కరపత్రాల పంపిణీ ద్వారా దుకాణదారులు, వ్యాపారులు మరియు ప్రజలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై విస్తృత అవగాహన కలిగించామన్నారు.ఇక నుండి దుకాణాలు, వాణిజ్య సంస్థలు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు, వీధి వ్యాపారులు లేదా ప్రజలుఎవరైనా నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగించినా, అమ్మినా, నిల్వ చేసినా లేదా పంపిణీ చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణదారులకు మొదటి, రెండు విడతల్లో జరిమానా విధించినప్పటికీ స్పందన రాకపోతే, సదరు వ్యాపారుల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు దుకాణాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
ప్లాస్టిక్ ఇయర్ బడ్స్, బెలూన్స్, జండాలకు వాడే ప్లాస్టిక్ పుల్లలు, క్యాండీ, ఐస్ క్రీమ్ పుల్లలు, అలంకరణకు వాడే థర్మాకోల్, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ట్రేలు, ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, స్ట్రాలు, స్టిర్రర్లు, మిఠాయి డబ్బాలు, సిగరెట్ ప్యాకెట్ల చుట్టూ వాడే ప్లాస్టిక్ ప్యాకింగ్ ఫిలిమ్స్, ప్లాస్టిక్ షీట్లు, కవర్ల వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందన్నారు.
నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు వార్డు స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ యూనిట్లు, గోదాములు, హోల్‌సేల్ మార్కెట్లు, రిటైల్ దుకాణాలు, వీధి వ్యాపారులు మరియు ఇతర వాణిజ్య సంస్థలపై ప్రతిరోజూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. కేంద్ర ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం, 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, 60 జిఎస్ఎం కంటే తక్కువ ఉన్న నాన్-ఓవెన్ క్యారీ బ్యాగులు మరియు 100 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్/పివిసి బ్యానర్ల వినియోగం చట్టరీత్యా పూర్తిగా నిషేధించబడిందన్నారు.
పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ప్రజారోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర ముప్పు కలిగించే ప్లాస్టిక్ సంచులను వినియోగించకుండా, వాటి స్థానంలో రీయూజ్ చేసే గుడ్డ సంచులు, జూట్ బ్యాగులను మాత్రమే వాడాలని కోరారు.
Prajavartha Online Telugu News