దర్శిలో రూ.27 కోట్లతో 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ ప్రారంభం

-రూ.150 కోట్ల‌తో ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో విద్యుత్ అభివృద్ధి ప‌నులు
-రూపాయి పనిచేయకుండా వెలిగొండను ప్రారంభించిన ఘనత జగన్‌కే చెల్లింది
-రాష్ట్ర అభివృద్ధి కోసం స్థానిక ఎన్నిక‌ల్లో కూట‌మిని గెలిపించాలి
-ఇంధ‌న‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

దర్శి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో లో ఓల్టేజీ, విద్యుత్‌ అంతరాయాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విద్యుత్‌ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. దర్శి నియోజకవర్గంలోని శివరామపురంలో రూ.27.66 కోట్లతో నిర్మించిన 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో ఆర్డీఎస్ఎస్‌ కింద రూ.90 కోట్లతో పనులు చేపట్టామని, విద్యుత్‌ శాఖకు సంబంధించి మొత్తం రూ.150 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రీవ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌ (ఆర్డీఎస్ఎస్‌) కింద రూ.8 వేల కోట్లతో విద్యుత్‌ మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టినట్లు మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు రూ.6 వేల కోట్లతో కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. గతంలో అసంపూర్తిగా మిగిలిన 50 సబ్‌స్టేషన్ల నిర్మాణాలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తున్నామని తెలిపారు. సబ్‌స్టేషన్లు అందుబాటులోకి వస్తే గృహ, పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ విద్యుత్‌ అవసరాలకు ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. దర్శి నియోజకవర్గంలో రూ.50 కోట్లతో దాదాపు 4 వేల సూర్యఘర్‌ విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. బీసీలకు అదనపు సబ్సిడీతో సూర్యఘర్‌ కనెక్షన్లు అందిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం రోజుకు 280 మిలియన్‌ యూనిట్లకు చేరినప్పటికీ, డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తిని పెంచి అంతరాయాలు లేకుండా సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు.

2014-19 మధ్య టెండర్లు పిలిచిన పలు సబ్‌స్టేషన్ల నిర్మాణాలను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్నా సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంతో విద్యుత్‌ వ్యవస్థలో సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి అందుబాటులో ఉన్నప్పటికీ ట్రాన్స్‌మిషన్‌ సబ్‌స్టేషన్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌మిషన్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని వేగవంతం చేశామని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ వెల్లడించారు.

వెలిగొండ పూర్తి చేసింది కూటమి ప్రభుత్వమే..

రూపాయి పని చేయకుండానే వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం జగన్‌కే చెల్లిందని మంత్రి గొట్టిపాటి ఎద్దేవా చేశారు. పూర్త‌వ్వ‌ని ప్రాజెక్టును ప్రారంభించినా.. ఒక్క ఎకరాకు సాగునీరు అందించలేదన్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాల కోసం రూ.750 కోట్లు ఖర్చు చేసి వెలిగొండను పూర్తి చేసిందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రెండేళ్లలోనే సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేశామని మంత్రి గుర్తు చేశారు. ఒక్క రూపాయి విద్యుత్‌ ఛార్జీ పెంచకుండానే 13 పైసలు ట్రూ డౌన్ చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో విద్యుత్‌ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతోపాటు తొమ్మిదిసార్లు విద్యుత్‌ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపారని విమ‌ర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి శ్రేణులన్నీ కలిసికట్టుగా పనిచేసి విజయానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీకి అవ‌కాశం ఇస్తే మ‌ళ్లీ ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో ద‌ర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి ల‌క్ష్మీ , కూట‌మి నాయ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *