– నోటీసులపై అత్యంత పారదర్శకంగా విచారణ
– అర్హత ఉన్న ప్రతి ఓటరు ఓటు హక్కు పరిరక్షణ
– అధికారుల సమన్వయంతో సజావుగా సర్ ప్రక్రియ..
– క్షేత్రస్థాయిలో పర్యటించిన రోల్ అబ్జర్వర్ ఎంవీ శేషగిరిబాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా నోటీసులు జారీచేసిన ఓటర్లకు సంబంధించి విచారణ ప్రక్రియను అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు కృషిచేస్తున్నారు. నోటీసులో పేర్కొన్న అంశాలను సంబంధిత ఓటర్లకు వివరించి, వారి వివరణను పూర్తిగా విని, అవసరమైన ఆధారాలు, పత్రాలను పరిశీలిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయి సిబ్బంది నిర్వహించిన పరిశీలన, సమర్పించిన నివేదికలను పరిగణనలోకి తీసుకుని వాస్తవాలను నిర్ధారించిన అనంతరం నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటున్నారు. సోమవారం విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని అయ్యప్ప నగర్ , మధ్య నియోజకవర్గంలోని అజిత్ సింగ్ నగర్ లో గల ఏఈఆర్ఓ కార్యాలయాల్లో ఐఏఎస్ అధికారి, రోల్ అబ్జర్వర్ ఎంవీ శేషగిరిబాబు.. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎంతో కలిసి పర్యటించారు. సర్ నోటీసులపై జరుగుతున్న విచారణ ప్రక్రియను పరిశీలించారు. హియరింగ్ సమయంలో నోటీసులో పేర్కొన్న అంశాలపై వారి వివరణను పూర్తిగా వింటున్న తీరును పరిశీలించారు. ఓటర్లు సంబంధిత చిరునామాలో నివసిస్తున్నారా, రికార్డుల్లో ఏవైనా పొరపాట్లు ఉన్నాయా, అవసరమైన ఆధారాలు, పత్రాలు సమర్పిస్తున్నారా, అలాగే బీఎల్వోలు, అధికారుల ఫీల్డ్ వెరిఫికేషన్ నివేదికలను పరిగణనలోకి తీసుకుంటున్న విధానాన్ని సమీక్షించారు. గర్భిణీలు, మంచానికే పరిమితమైన వారు, ఆరోగ్య పరిస్థితుల కారణంగా విచారణకు హాజరు కాలేని ఓటర్లు, ఇతర రాష్ట్రాలు లేదా దేశాల్లో ఉన్న ఓటర్లు తదితర కేసుల్లో సంబంధిత వ్యక్తుల వాస్తవ పరిస్థితులను నిర్ధారించేందుకు అధికారులు చేపడుతున్న చర్యల గురించి అడిగారు. అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరమే నియమనిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రక్రియలో భాగస్వాములయ్యేలా బీఎల్వోలు, క్షేత్రస్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి ఓటరు ఓటు హక్కును పరిరక్షించడమే ప్రక్రియ లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని రోల్ అబ్జర్వర్ శేషగిరిబాబు స్పష్టం చేశారు.
1,90,348 నోటీసుల పంపిణీ:
ఇప్పటివరకు 1,90,348 నోటీసుల పంపిణీ జరగ్గా.. వీటిలో 75,471 మందికి విచారణ నిర్వహించడం జరిగింది. 58,895 మందికి విచారణ షెడ్యూలు గడువు ముగియగా విచారణ కోసం రీషెడ్యూల్ చేయడం జరుగుతోంది. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News