-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరాన్ని గుంతల రహిత రహదారులతో పాటు పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కమిషనర్ తన పర్యటనలో భాగంగా నేతాజీ బ్రిడ్జి, కృష్ణలంక, బందర్ రోడ్డు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. రహదారుల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ, రహదారుల పరిస్థితి, మొక్కల సంరక్షణ తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడా గుంతలు లేకుండా చూడాలని, గుంతల రహిత రహదారులే లక్ష్యంగా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. రహదారులపై గుంతలు లేదా ఇతర సమస్యలు గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.
నగరంలోని ప్రధాన రహదారులు, సర్వీస్ రోడ్లు, వంతెనల పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రహదారుల వెంట పేరుకుపోయిన చెట్ల కొమ్మలు, ఆకులు, ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. వ్యర్థాలు పేరుకుపోకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలను గుర్తించిన వెంటనే పరిష్కరించాలని సూచించారు.
సూర్యారావుపేట ప్రాంతంలో వాల్ పెయింటింగ్స్, గ్రీనరీని పెంచడం ద్వారా నగర సౌందర్యాన్ని మరింత మెరుగుపరచాలని కమిషనర్ సూచించారు. అనంతరం కృష్ణలంక సర్వీస్ రోడ్ ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణను పరిశీలించిన ఆయన, రహదారులపై ఎక్కడా చెత్త, వ్యర్థాలు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వర్షాల కారణంగా నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి వెంటనే సమస్యను పరిష్కరించాలని, నీరు నిల్వ ఉండటం వల్ల దోమల ఉత్పత్తికి అవకాశం లేకుండా పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని సూచించారు.
Prajavartha Online Telugu News