-సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేతయే లక్ష్యం
-బుడమేరు వరద బాధితులను, పేదల ఇళ్ల స్థలాలను పట్టించుకోని ప్రభుత్వంపై మండిపాటు
-మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డిప్యూటీ మేయర్, మాజీ కార్పొరేటర్లు, పెద్ద సంఖ్యలో కేడర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, గత రెండున్నర సంవత్సరాలుగా విజయవాడ నగరానికి, సెంట్రల్ నియోజకవర్గానికి కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని విమర్శించారు. పక్కనే ఉన్న మంగళగిరి, పిఠాపురం, కుప్పం నియోజకవర్గాల్లో వందల కోట్లు ఖర్చు పెడుతూ, విజయవాడ నగరం ఏం పాపం చేసిందని నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. బుడమేరు వరదలు వచ్చి రెండేళ్లు పూర్తయినా బాధితులను ప్రభుత్వం పట్టించుకోలేదని, వచ్చిన విరాళాలు తప్ప ప్రభుత్వం సొంతంగా చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. వరదల్లో ఆటోలు, వాహనాలు, ఫర్నిచర్ దెబ్బతిని ప్రజలు తీవ్రంగా నష్టపోతే ఎలాంటి ఇన్సూరెన్స్ లేదా పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో విజయవాడలో సంక్షేమం, అభివృద్ధి వేగంగా జరిగాయని విష్ణు గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం కొత్త పెన్షన్లు గానీ, మహిళలకు చేయూత, ఆసరా వంటి పథకాలు గానీ అందించడం లేదన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారెంటి అని చెప్పి ఇచ్చిన బాండ్లు ఇప్పుడు ప్రజలను మోసం చేసే విధంగా తయారయ్యాయని, ఆగస్టు 25 నుంచి డబ్బులు వేస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 10 వేల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించలేదని, గతంలో ప్రారంభించిన 22-23 నాడు, నేడు పాఠశాలల పనులు 50% నుండి 80% పూర్తయినా విద్యాశాఖ మంత్రి వాటిని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండున్నరేళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వం విజయవాడ అభివృద్ధి, విద్యా వ్యవస్థ, ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ విషయంలో చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని, తీవ్ర వివక్షను ప్రజల్లోకి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో కాంట్రాక్టర్లకు రూ. 500 కోట్లు చెల్లించలేక ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు లేక రోగులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. అలాగే జూనియర్ డాక్టర్ల సమ్మెపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. లక్షలాది ఓట్లను తొలగించి స్థానిక ఎన్నికలకు ఏ విధంగా వెళ్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ 100% సిద్ధంగా ఉందన్నారు. కొత్త పింఛన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, పాఠశాలల నాడు, నేడు పనులను పక్కన పెట్టేసిన కూటమి ప్రభుత్వ అక్రమాలు, వివక్షపై ప్రజల్లోకి వెళ్లేందుకు కేడర్‌ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వైఎస్ జగన్ హయాంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రభుత్వం రద్దు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని మల్లాది విష్ణు తెలిపారు. 10 డివిజన్లలో 7,600 మంది నిరుపేదలకు జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు అమరావతి లో కేటాయించి శంకుస్థాపన చేస్తే… కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో 2 నుండి 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పి, ఇప్పుడున్న స్థలాలను కూడా లాక్కోవడం దారుణమన్నారు. నున్న, సూరంపల్లిలో నిర్మించిన 4,000 ఇళ్లకు రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, జగనన్న కాలనీల లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, అవసరమైతే భారీ ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. మాజీ డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, మాజీ కార్పొరేటర్ లు, శర్వాణి మూర్తి, ఇసరపు శ్రీదేవి రమేష్, షాహినా సుల్తానా అఫిజుల్లా, కుక్కల అనిత, కొండాయిగుంట మల్లేశ్వరి, యర్రగొర్ల తిరుపతమ్మ, వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, వైసీపీ నాయకులు, సుందర పాల్, పసుపులేటి యేసు, అలంపురి విజయ్, ఉద్దంటి సురేష్, భోగాది మురళి, చింతా చిన్నా, కొండా మహేష్ రెడ్డి, పిల్లట్ల వంశీ, ఆర్ ఎస్ నాయుడు, రామిరెడ్డి, యర్రంశెట్టి అంజిబాబు, వడ్డీ వాసు, మీసాల సత్యనారాయణ బాల నాగమ్మ, హరిబాబు, త్రివేణి రెడ్డి, మేడేపల్లి ఝాన్సీ, తోపుల వరలక్ష్మీ, అరసవల్లి హేమలత, బేతపూడి కల్యాణి, కందేరు మంగాదేవి, బొమ్మారెడ్డి రాజ్య లక్ష్మి, మారుతి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News