-వంటగది పరిశుభ్రత పాటించని మూడు హోటళ్లకు జరిమానా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నగరంలోని హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, జ్యూస్ షాపులు, టీ స్టాళ్లలో గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. విజయవాడ సర్కిల్-1 పరిధిలోని 37వ డివిజన్లో వివిధ ఆహార విక్రయ కేంద్రాలను అధికారులు తనిఖీ చేసి, వంటగది పరిశుభ్రతా ప్రమాణాలు పాటించని మూడు హోటళ్లపై మొత్తం రూ.7,000 జరిమానా విధించారు. వంటగది అపరిశుభ్రంగా ఉండటంతో త్రినాధ్ టిఫిన్ సెంటర్కు రూ.3,000, త్రినాధ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు రూ.3,000, మహాలక్ష్మి స్వీట్స్ అండ్ సమోసాకు రూ.1,000 చొప్పున జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు తప్పనిసరిగా పరిశుభ్రతా ప్రమాణాలను పాటించాలని అధికారులు సూచించారు. వంటగది, ఆహార పదార్థాల నిల్వ ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, ఆహార పదార్థాలను దుమ్ము, ఈగలు, ఇతర కీటకాల నుంచి రక్షించే విధంగా మూతలతో భద్రపరచాలని తెలిపారు.
అదేవిధంగా వినియోగించి వాడి పడేసే గ్లాసులు, కప్పులు, ప్లేట్లు తదితర పాత్రలను తిరిగి వినియోగించే సందర్భంలో వేడి నీటితో స్టెరిలైజ్ చేసి, పూర్తిగా పరిశుభ్రపరిచిన అనంతరం మాత్రమే వినియోగించాలని సూచించారు. ఆహారం తయారీ, నిల్వ, సర్వింగ్ సమయంలో పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రతను కూడా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల నిర్వాహకులు నిర్దేశిత పరిశుభ్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని వీఎంసీ అధికారులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ తనిఖీలలో వీఎంసీ AMOH-1 డా. అన్నపూర్ణ, శానిటరీ సూపర్వైజర్ డి. సోమరాజు ఆధ్వర్యంలో 37వ డివిజన్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ రవి శంకర్, శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News