విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి గురువారం సీతారామపురంలోని మదర్ థెరిసా పాఠశాలలో విఎంసి రీజినల్ ఫైర్ ఆఫీసర్ సిహెచ్. రత్నబాబు ఆకస్మిక తనిఖీ నిర్వహించి, అక్కడి సిబ్బందికి అగ్నిమాపక పరికరాల వినియోగం మరియు విద్యార్థులకు అగ్నిప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు.
అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు క్లాస్‌రూమ్‌లలో పొగ వ్యాపిస్తే విద్యార్థులు నేలపై పాకుతూ సురక్షితంగా బయటకు రావాలని, అనంతరం నిర్ణయించిన సేఫ్ అసెంబ్లీ పాయింట్ వద్ద అందరూ ఒకే చోటకు చేరాలని ఫైర్ అధికారులు సూచించారు. అక్కడ ఫ్లోర్ ఇన్‌చార్జ్‌లు తమ పరిధిలోని విద్యార్థులు ఎంతమంది సురక్షితంగా బయటకు వచ్చారో, ఇంకా ఎంతమంది కనిపించడం లేదో వెంటనే లెక్కించుకోవాలని అవగాహన కల్పించారు.
విద్యార్థుల సంఖ్యను లెక్కించిన అనంతరం మిస్సైన విద్యార్థులను వెంటనే గుర్తించి, అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బందికి వారి వివరాలను తెలియజేస్తే, వారు సంబంధిత క్లాస్‌రూమ్‌లు లేదా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టి, ప్రమాదంలో చిక్కుకున్న విద్యార్థులను త్వరగా గుర్తించి సురక్షితంగా రక్షించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు.
అగ్ని ప్రమాద సమయంలో విద్యార్థులు భయాందోళనలకు గురికాకుండా, క్రమశిక్షణతో సురక్షిత ప్రాంతానికి చేరుకోవడం, హాజరు సంఖ్యను వెంటనే నిర్ధారించడం, మిస్సైన విద్యార్థుల సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి అందించడం వంటి చర్యలు ప్రాణ రక్షణలో ఎంతో కీలకమని ఫైర్ అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించే విధానం, ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అదుపు చేయాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్స్‌ను ఎక్కడెక్కడ అమర్చాలి, వాటి ద్వారా స్మోక్ అలారం ఎలా పనిచేస్తుంది, పరిసరాల్లో ఎలాంటి ఫైర్ సేఫ్టీ చర్యలు చేపట్టాలి వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఎటువంటి అగ్ని ప్రమాదం జరగకుండా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అగ్నిమాపక భద్రతా చర్యలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News