ఒత్తిడిని జయిస్తే.. పనితీరు భేష్‌!

– ఉద్యోగులు ఒత్తిడిని సమర్థంగా నిర్వహించుకుని పనితీరును మెరుగుపరుచుకోవాలి: కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, డీసీపీ కేజీవీ స‌రిత‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి, వారి పనితీరు, సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో ప్రతి గురువారం స్ట్రెస్ మేనేజ్‌మెంట్ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఇప్పటివరకు 15 సెషన్లు విజయవంతంగా పూర్తయ్యాయని ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటున్న ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ‘స్ట్రెస్ మేనేజ్‌మెంట్’ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, పని సామర్థ్యం మెరుగుపడేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని గుర్తించి, దాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడం ద్వారా పనితీరును మరింత మెరుగుపరుచుకోవచ్చన్నారు.
కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న డీసీపీ కేజీవీ సరిత మాట్లాడుతూ పని ఒత్తిడి ఉద్యోగ జీవితంలో సహజమైనదేనని, అయితే దాన్ని సక్రమంగా నిర్వహించుకోకపోతే మానసిక ప్రశాంతతపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఒత్తిడిని వివరించేందుకు 250 గ్రాముల నీటి సీసా ఉదాహరణను ఆమె ప్రస్తావించారు. కొద్దిసేపు చేతిలో పట్టుకోవడం సులభంగానే ఉన్నప్పటికీ, ఎక్కువసేపు అదే బరువును మోస్తే ఇబ్బందిగా మారినట్లే, సమస్యలను నిరంతరం మనసులో మోస్తే ఒత్తిడి పెరుగుతుందని వివరించారు. అందువల్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ, మనసుకు తగిన విశ్రాంతి కల్పించుకోవాలని సూచించారు. పనులను వాయిదా వేయకుండా ప్రతిరోజూ ‘టు-డూ లిస్ట్’ రూపొందించుకోవాలని డీసీపీ సరిత సూచించారు. ముఖ్యమైన, అత్యవసరమైన పనులకు ప్రాధాన్యత ఇచ్చి ముందుగా పూర్తిచేయాలని తెలిపారు. గడువుకు ముందే పనులను పూర్తిచేయడం ద్వారా చివరి నిమిషంలో ఏర్పడే ఒత్తిడిని తగ్గించుకోవచ్చన్నారు. అవసరమైన సందర్భాల్లో పనులను సహచరులకు అప్పగించడం (*Delegation*), అలాగే తమ పరిధికి మించిన లేదా అనవసరమైన పనులకు తగిన సందర్భంలో ‘No’ చెప్పడం కూడా ఉద్యోగులు అలవర్చుకోవాలని సూచించారు. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజూ వ్యాయామం, నడక, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయాలని డీసీపీ సరిత సూచించారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి రోజుకు 6 నుంచి 7 గంటల నాణ్యమైన నిద్ర ఎంతో అవసరమని తెలిపారు.
కార్యక్రమానికి సైకాలజిస్ట్ డా. టి.ఎస్. రావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో డా. గర్రె శంకర్ రావు, హరిత, శ్రీపతి జగదీష్, సైకాలజిస్ట్ నవిత, సైకాలజిస్ట్ వేణుగోపాల్, సైకాలజిస్ట్ కవిత, నోడల్ అధికారి జి. జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *