అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా ప్రతిపాదించిన ఎనర్జీ స్టేషన్ల ఏర్పాటుపై వివిధ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో(OMCs) APCRDA అధికారులు గురువారం, 2026 ఆగస్టు 27న రాయపూడిలోని ప్రధాన కార్యాలయంలో ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో BPCL, HPCL, Jio-bp, IOCL, Nayara సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతిపాదిత ఎనర్జీ స్టేషన్ల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సంస్థల ప్రతినిధులు APCRDA అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సమావేశంలో APCRDA ఎకనామిక్ డెవలప్మెంట్ విభాగ జాయింట్ డైరెక్టర్ అంజనా జేమ్స్, జనరల్ మేనేజర్ SJS స్టీఫెన్..ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. సంస్థల ప్రతినిధులు.. ప్రీ బీడ్ సమావేశంలో వెల్లడించిన అంశాలు, సూచనలను నమోదు చేసుకున్నారు.
అనంతరం APCRDA అధికారులు..రాయపూడి ప్రధాన కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్‌లోని అమరావతి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(AICCC)లో డిజిటల్ ట్విన్ ద్వారా అమరావతి అభివృద్ధిని విజువల్ సిమ్యులేషన్ రూపంలో సంస్థల ప్రతినిధులకు వివరించారు. రాజధాని నగరంలో ఇప్పటికే జరుగుతున్న పనులు, ప్రతిపాదిత అభివృద్ధి, ఎనర్జీ స్టేషన్ల కోసం గుర్తించిన ప్రాంతాలు, వాటి చుట్టుపక్కల చేపట్టనున్న మౌలిక వసతుల అభివృద్ధిని డిజిటల్ ట్విన్ ద్వారా పూర్తిగా వివరించారు.
అమరావతిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల విస్తృతి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తున్న ప్రణాళికలను ప్రత్యక్షంగా చూసిన OMCల ప్రతినిధులు తమ ప్రతిపాదనలు కార్యరూపం చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఎనర్జీ స్టేషన్ల కోసం ప్రతిపాదించిన ప్రాంతాల్లో భవిష్యత్తులో పెరగనున్న రాకపోకలు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి అవకాశాలను వారు పరిశీలించారు.
ప్రజారాజధాని అమరావతి అభివృద్ధిలో భవిష్యత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి, మౌలిక వసతులు & అవసరమైన సేవలను సమగ్ర ప్రణాళికతో అందుబాటులోకి తీసుకురావడంపై APCRDA ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రాజధాని నగర విస్తరణకు అనుగుణంగా ఎనర్జీ స్టేషన్ల వంటి కీలక సదుపాయాలకు తగిన ప్రాంతాలను ముందుగానే గుర్తించడం ద్వారా సమతుల్యమైన, ప్రణాళికాబద్ధమైన రాజధాని అభివృద్ధికి APCRDA చర్యలు చేపడుతోంది. రాజధాని అమరావతి అభివృద్ధి వేగం పుంజుకున్న నేపథ్యంలో ఇంధన అవసరాలకు అనుగుణంగా అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంలో ఈ ప్రీ-బిడ్ సమావేశం కీలక ముందడుగుగా నిలిచింది.
Prajavartha Online Telugu News