విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని మహిళా అధికారులు నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ డా.లక్ష్మీశకు రాఖీ కట్టి మిఠాయి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. లక్ష్మీశ జిల్లాలోని మహిళలందరికీ హృదయపూర్వక రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
రాఖీ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మహిళల భద్రత, సాధికారత, విద్య, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో మరింత ముందుకు సాగుతూ తమ ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు. మహిళలకు సమాన అవకాశాలు, గౌరవం, భద్రత కల్పించడం ప్రతిఒక్కరి బాధ్యత అని అన్నారు. రాఖీ పండుగ స్ఫూర్తితో పరస్పర ప్రేమ, గౌరవం, సోదరభావంతో సమాజంలో సానుకూల వాతావరణాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
జిల్లాలోని మహిళలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, వారి కుటుంబాల్లో ఆనందం, శాంతి, సౌభాగ్యం నిండాలని జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News