– అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు..
– నియోజకవర్గ స్థాయి ప్రత్యేక గ్రీవెన్స్‌కు 170 అర్జీలు
– జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నియోజకవర్గ స్థాయి ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యమైన, సంతృప్తికరమైన పరిష్కారం అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా, అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
శుక్రవారం ఒక నెల – ఒక నియోజకవర్గo – నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట నియోజకవర్గ స్థాయిలో జగ్గయ్యపేట ఎస్.వి.ఎస్ కళ్యాణ మండపంలో జరిగిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, స్థానిక శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొన్నారు. స్థానిక ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ సేవలకు సంబంధించి 115, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 25, పట్టణ పరిపాలనకు సంబంధించి 18, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖకు 4, గ్రామీణ నీటి సరఫరాకు 4, వైద్య ఆరోగ్య శాఖకు 2, రహదారులు-భవనాల శాఖకు 1, వ్యవసాయ శాఖకు 1 అర్జీ వచ్చాయి. వీటిని క్షుణ్నంగా పరిశీలించి వాటి పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలకు క్షేత్రస్థాయి పరిశీలన అవసరమైతే వెంటనే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. ప్రతి అర్జీకి సంబంధించిన వివరాలను పరిశీలించి, నిర్ణీత సమయంలో పరిష్కారం చూపడంతో పాటు సంబంధిత అర్జీదారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ ప్రజల సమస్యలను వారి వద్దకే వెళ్లి తెలుసుకుని పరిష్కరించేందుకు “ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు” కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కలుగుతోందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని.. ఇందుకోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు సూచించారు. కార్యక్రమంలో నందిగామ ఆర్‌డీవో అనిల్ కుమార్, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News