రూ. 1,00,648 కోట్ల‌తో వార్షిక రుణ ప్ర‌ణాళిక

– 2026-27 ఆర్థిక సంవ‌త్స‌రానికి ప్ర‌తిపాద‌న‌ల ఆవిష్క‌ర‌ణ‌
– గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంతో పోల్చితే రూ. 17,148 కోట్లు అద‌నం
– ప్రాధాన్య రంగానికి రూ. 38,173 కోట్ల రుణ ప్ర‌తిపాద‌న‌లు
– స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో బ్యాంకులు చోదక శక్తిగా నిల‌వాలి
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్ర‌జా సంక్షేమం, ఆర్థిక ప్ర‌గ‌తి, స‌మ‌గ్రాభివృద్ధి ల‌క్ష్యంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లుచేస్తున్న ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేయ‌డంలో బ్యాంక‌ర్ల పాత్ర కీల‌క‌మ‌ని.. 2026-27 ఆర్థిక సంవ‌త్స‌రానికి ప్ర‌తిపాదించిన రూ. 1,00,648 కోట్ల వార్షిక రుణ ప్ర‌ణాళిక (ఏసీపీ) ల‌క్ష్యాల‌ను పూర్తిస్థాయిలో చేరుకునేందుకు బ్యాంకులు కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.
శుక్ర‌వారం ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో లీడ్ జిల్లా కార్యాల‌యం ఆధ్వ‌ర్యంలో జిల్లా సంప్ర‌దింపుల క‌మిటీ (డీసీసీ), జిల్లాస్థాయి స‌మీక్ష క‌మిటీ (డీఎల్ఆర్‌సీ) స‌మావేశాలు జ‌రిగాయి. స‌మావేశంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. బ్యాంకింగ్, సీఎఫ్ఎల్ అధికారుల‌తో క‌లిసి 2026-27 వార్షిక రుణ ప్ర‌ణాళిక‌ను ఆవిష్క‌రించారు. ఎల్‌డీఎం.. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రానికి నిర్దేశించుకున్న ల‌క్ష్యాల సాధ‌న‌లో వివిధ బ్యాంకుల పాత్ర‌, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన కీల‌క సూచిక‌ల్లో ప్ర‌గ‌తి, ప్ర‌భుత్వ ప‌థ‌కాలకు సంబంధించి బ్యాంక్ లింకేజీ రుణాలు, ఆర్థిక అక్ష‌రాస్య‌త కార్య‌క్ర‌మాలు త‌దిత‌రాల‌ను పీపీటీ ద్వారా వివ‌రించారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ లక్ష్మీశ మాట్లాడుతూ 2026-27 ఆర్థిక సంవ‌త్స‌రానికి వ్య‌వ‌సాయ రంగానికి రూ. 14,736 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 20,614 కోట్ల రుణ ల‌క్ష్యాల‌ను ప్ర‌తిపాదించిన‌ట్లు తెలిపారు. మొత్తం ప్రాధాన్య‌రంగానికి రూ. 38,173 కోట్లు, ప్రాధాన్యేత‌ర రంగానికి రూ. 62,475 కోట్ల మేర ల‌క్ష్యాల‌ను రుణ ప్ర‌ణాళికలో పొందుప‌రిచిన‌ట్లు వివ‌రించారు. ఇత‌ర ప్రాధాన్య రంగానికి రూ. 2,823 కోట్ల రుణాల‌ను ప్ర‌తిపాదించిన‌ట్లు తెలిపారు. గ‌తేడాది రుణ ప్ర‌ణాళిక ల‌క్ష్యాల సాధ‌న‌లో బ్యాంకులు మంచి ప్ర‌గ‌తి క‌న‌బ‌రిచాయ‌ని.. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలోనూ బ్యాంకులు మ‌రింత కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి, ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు కృషిచేయాల‌న్నారు. ప్రభుత్వ పథకాల లక్ష్యం లబ్ధిదారులకు చేరాలంటే ప్రభుత్వ యంత్రాంగంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో అన్ని ప్ర‌గ‌తి సూచిక‌ల స్కోరును ఏ ప్ల‌స్ కేట‌గిరీకి తీసుకెళ్లేందుకు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌న్నారు. ఐవీఆర్‌ఎస్ ద్వారా లబ్ధిదారులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ప‌నితీరుకు అద్దంప‌డుతోంద‌ని.. అందువ‌ల్ల ల‌బ్ధిదారుల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు కృషిచేయాల‌న్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో బ్యాంకులు చోదక శక్తిగా నిలవాలని, నిర్దేశిత గ‌డువులోగా సేవ‌లు అందించేందుకు కృషిచేయాల‌న్నారు. ఒక కుటుంబం-ఒక పారిశ్రామిక‌వేత్త లక్ష్యంతో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని, ‘స్వయం’ బ్రాండ్ ద్వారా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మరింత మార్కెట్ కల్పించేందుకు బ్యాంకులు ఆర్థిక సహకారం అందించాలని అన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు రుణాలను వేగంగా మంజూరు చేయాలని సూచించారు. నాబార్డ్, ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్, ఆర్థిక అవగాహన కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.
స‌మావేశంలో లీడ్ బ్యాంక్ యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజ‌న‌ల్ హెడ్ ఎంవీ తిల‌క్‌, ఆర్‌బీఐ ఎల్‌డీవో రోహిత్ అగ‌ర్వాల్‌, ఎల్‌డీఎం పి.వెంక‌ట సుబ్బ‌య్య‌, ఆర్‌సేతి డైరెక్ట‌ర్ వి.అమ‌రేశ్వ‌ర‌రెడ్డి, వీఎంసీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ డా. డి.చంద్ర‌శేఖ‌ర్‌, సెంట‌ర్ ఫ‌ర్ ఫైనాన్షియ‌ల్ లిట‌ర‌సీ స్టేట్ హెడ్ బాబూరావు, వివిధ బ్యాంకుల అధికారులు, ప‌రిశ్ర‌మ‌లు, వ్య‌వ‌సాయ అనుబంధ రంగాలు, డీఆర్‌డీఏ, మెప్మా త‌దిత‌ర శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *