నీళ్లు లేని సమయంలో జలహారతి ఎందుకు?… : గుజ్జుల ఈశ్వరయ్య

-10.70 టీఎంసీలు నల్లమలసాగర్‌కు తరలిస్తే మొత్తం వెలిగొండ పూర్తయినట్లా?
-4,47,300 ఎకరాల చివరి ఆయకట్టుకు నీరందే వరకు ప్రాజెక్టు పూర్తి కాదు
-రూ.3,500 కోట్లు కేటాయించి పెండింగ్‌ పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలి
-వెలిగొండ వద్ద పూల సుబ్బయ్య విగ్రహం, శాశ్వత పోరాట స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశైలం జలాశయంలో నీటి లభ్యత పరిమితంగా ఉండి, కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్న సమయంలో అందుబాటులో ఉన్న నీటిని అత్యంత జాగ్రత్తగా వినియోగించాల్సిన ప్రభుత్వం, కేవలం రాజకీయ ప్రచారం కోసం జలహారతి నిర్వహించడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నీటి లభ్యత, ఇరు రాష్ట్రాల అవసరాల నేపథ్యంలో తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన పరిస్థితుల్లో, కేవలం 10.70 టీఎంసీల నీటిని నల్లమలసాగర్‌కు తరలించి మొత్తం వెలిగొండ పూర్తయినట్లు ప్రచారం చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనన్నారు.

విజయవాడ దాసరి భవన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫేజ్‌–1 ప్రారంభం కావడం స్వాగతించదగిన విషయమే అయినా, దానినే మొత్తం వెలిగొండ ప్రాజెక్టు పూర్తయినట్లు చెప్పడం వాస్తవ విరుద్ధమని స్పష్టం చేశారు. 10.70 టీఎంసీలతో సుమారు 1.19 లక్షల ఎకరాలకు ప్రయోజనం కల్పించాలన్నది ఒక దశ మాత్రమేనని, మొత్తం వెలిగొండ లక్ష్యం 4,47,300 ఎకరాలు అని తెలిపారు. ఇందులో ప్రకాశం జిల్లాలో 3,36,100, నెల్లూరు జిల్లాలో 84,000, కడప జిల్లాలో 27,200 ఎకరాలు ఉన్నాయని వివరించారు.

“జలహారతి ఇవ్వడం, టన్నెల్లో నీరు ప్రవహించడం, రిజర్వాయర్‌లో నీరు నిల్వ కావడం ప్రాజెక్టు పూర్తయినదానికి ప్రమాణాలు కావు. చివరి ఆయకట్టు రైతు పొలంలో నీరు పారినప్పుడే ప్రాజెక్టు పూర్తయినట్లు. 10.70 టీఎంసీలు ఒక దశకు సంబంధించిన నీరు మాత్రమే. మిగిలిన 3.28 లక్షల ఎకరాలకు నీరు ఎప్పుడు? ఏ కాలువ ద్వారా? ఏ రిజర్వాయర్‌ ద్వారా? ప్రభుత్వం స్పష్టమైన కాలపట్టిక ఎందుకు ప్రకటించడం లేదు?” అని ఈశ్వరయ్య ప్రశ్నించారు.

ప్రాజెక్టు అంటే టన్నెల్‌ కాదు.. రైతు పొలం

వెలిగొండ నీరు రైతు పొలానికి చేరాలంటే ప్రధాన నీటి తరలింపు వ్యవస్థతో పాటు మెయిన్‌ కెనాళ్లు, ఫీడర్‌, బ్రాంచ్‌, డిస్ట్రిబ్యూటరీ, ఫీల్డ్‌ ఛానళ్లు, రిజర్వాయర్లు, లిఫ్టులు, టన్నెల్స్‌, లైనింగ్‌ పనులు పూర్తికావాలని అన్నారు. ఈస్టర్న్‌ మెయిన్‌ కెనాల్‌ ద్వారా సుమారు 3.7 లక్షల ఎకరాలకు నీరు అందించాల్సి ఉన్నందున పెండింగ్‌ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు.

వేములపాడు, వేదుళ్ల చెరువు, భైరవకోన ప్రాంతాల్లోని సంబంధిత టన్నెల్‌, లైనింగ్‌ పనులతో పాటు అర్థవీడు మండలంలోని టన్నెల్‌ పనుల భద్రత, లైనింగ్‌ నాణ్యతను నిపుణులతో తనిఖీ చేయించాలని డిమాండ్ చేశారు. మార్కాపురం వరకు నీరు చేరడమే విజయంగా భావించకుండా కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, నెల్లూరు, కడప ప్రాంతాల చివరి ఆయకట్టుకు నీరు చేరేలా పూర్తి పంపిణీ వ్యవస్థను సిద్ధం చేయాలన్నారు.

పెదిరెడ్డిపల్లి రిజర్వాయర్‌, రాచర్ల–గుండ్ల బ్రహ్మేశ్వరం లిఫ్ట్‌లు తదితర అనుబంధ పనులను పూర్తి చేయకుండా మొత్తం ప్రాజెక్టు పూర్తయిందని చెప్పడం సరికాదన్నారు. గ్రామ చెరువుల్లో పూడిక తొలగించి, కట్టలు, తూములు, కాలువలను పునరుద్ధరించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని కోరారు.

వెలిగొండ పునాదిలో నాలుగు దశాబ్దాల సీపీఐ పోరాటం

వెలిగొండ ప్రాజెక్టు కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదని, కరువు ప్రాంత ప్రజల నాలుగు దశాబ్దాల పోరాట ఫలితమని ఈశ్వరయ్య అన్నారు. 1972 నుంచే సీపీఐ కృష్ణా జలాల కోసం ఉద్యమాలు నిర్వహించిందని, పూల సుబ్బయ్య, గుజ్జుల యలమందారెడ్డి, కాశిరెడ్డి, రావులపల్లి చెంచయ్య, తుపాకుల బసవయ్య, గురుస్వామిరెడ్డి తదితర నాయకులు ప్రజలను సమీకరించి పోరాటాన్ని ముందుకు నడిపారని గుర్తుచేశారు.

పాదయాత్రలు, ప్రజా సమావేశాలు, కలెక్టరేట్‌ ముట్టడులు, నిరసనలతో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చామని తెలిపారు. 1994లో పూల సుబ్బయ్య అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును కలిసి వెలిగొండ ప్రాజెక్టు ప్రతిపాదనను అందించారని, 1996లో శంకుస్థాపన జరిగిందని, 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా పనులను ముందుకు తీసుకెళ్లిందని వివరించారు.

“ఒక ప్రభుత్వం శంకుస్థాపన చేసిందని మొత్తం చరిత్ర తనదికాదు. మరో ప్రభుత్వం పనులు చేసిందని ప్రజల దశాబ్దాల పోరాటాన్ని చెరిపేయలేరు. వెలిగొండ పునాదిలో సీపీఐ పోరాటం ఉంది. పూల సుబ్బయ్య త్యాగం ఉంది. కరువు రైతుల కన్నీళ్లు ఉన్నాయి. ఈ చరిత్రను ఎవరూ చెరిపేయలేరు.” అని ఈశ్వరయ్య స్పష్టం చేశారు.

పూల సుబ్బయ్యకు ఘన నివాళి ఇవ్వాలి

వెలిగొండ ప్రాజెక్టు వద్ద పూల సుబ్బయ్య విగ్రహంతో పాటు ఆయన జీవిత చరిత్ర, వెలిగొండ ఉద్యమ చరిత్రను తెలియజేసే శాశ్వత స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టడం మాత్రమే గౌరవం కాదని, ఆయన ఆశయాలను నెరవేర్చడమే నిజమైన నివాళి అన్నారు.

నిర్వాసితులకు సంపూర్ణ న్యాయం చేయాలి

వెలిగొండ కోసం భూములు, ఇళ్లు, జీవనాధారాలు కోల్పోయిన 11 గ్రామాల 7,321 మంది నిర్వాసితులకు సంపూర్ణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరిహారంతో పాటు ఇళ్లు, తాగునీరు, విద్యుత్‌, రహదారులు, పాఠశాలలు, ఆరోగ్యం, పారిశుధ్యం, జీవనోపాధి వంటి మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే పునరావాసం పూర్తయినట్లు భావించాలన్నారు.

రూ.3,500 కోట్లు కేటాయించాలి – శ్వేతపత్రం విడుదల చేయాలి

వెలిగొండను పూర్తిస్థాయిలో పూర్తి చేసేందుకు ఇంకా సుమారు రూ.3,500 కోట్లు కేటాయించాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ప్రతి పెండింగ్‌ పనికి గడువు నిర్ణయించి ప్రజలకు ప్రకటించాలని, ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధులు, మిగిలిన పనులు, పనుల పురోగతి, నీటి లభ్యత, 4,47,300 ఎకరాలకు నీటి పంపిణీ, రిజర్వాయర్లు, కాలువలు, లిఫ్టులు, టన్నెల్స్‌, నిర్వాసితుల పునరావాసంపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.

“జలహారతి కాదు.. రైతు పొలంలో నీటి హారతి కావాలి.
10.70 టీఎంసీల ప్రచారం కాదు.. 4,47,300 ఎకరాల చివరి ఆయకట్టుకు నీటి హామీ కావాలి.
టన్నెల్లో నీరు కాదు.. రైతు పొలంలో నీరు కావాలి.
ప్రారంభోత్సవం కాదు.. సంపూర్ణ ప్రాజెక్టు కావాలి.
రాజకీయ క్రెడిట్‌ కాదు.. కరువు ప్రాంతానికి శాశ్వత నీటి భద్రత కావాలి.
చివరి ఆయకట్టు రైతు పొలంలో నీరు పారిన రోజే వెలిగొండ నిజంగా పూర్తయిన రోజు. అదే పూల సుబ్బయ్యకు నిజమైన నివాళి.” అని ఈశ్వరయ్య స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, పి. దుర్గాభవానీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రవీంద్రనాథ్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *