– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ, భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి లోపాలకు తావులేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి శనివారం కలెక్టర్ లక్ష్మీశ గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక పరికరాలను పరిశీలించి అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను సమర్పించడం జరుగుతోందన్నారు. అదేవిధంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులు, సిబ్బందిని సూచించారు.
ఈవీఎం, వీవీప్యాట్ల గోదాము తనిఖీలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహంతో పాటు ఏదుపాటి రామయ్య (తెదేపా), పి.గోవింద (భాజపా), బి.మురళీకృష్ణ (ఐఎన్‌సీ), జిడగం శ్రీనివాస్ (జేఎస్‌పీ) పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News