రాయలసీమలో పల్లె సీమల అభివృద్ధి

-సీమ ప్రజల కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక విజన్
-రూ. 8,022 కోట్లతో గ్రామాలు, అటవీ అభివృద్ధి ప్రణాళికలు
-రూ. 4,523 కోట్లతో 23,000కు పైగా రోడ్ల పనులు
-5,238 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి
-జల సంరక్షణ చర్యలతో సీమ సస్యశ్యామలం
-ఉపాధి హామీ ద్వారా 62 వేల ఎకరాల్లో ఉద్యాన సాగు… 28 వేల మంది రైతులకు లబ్ధి
-నీటి కుంటలు, ఇంకుడు గుంతలతో భూగర్భ జలాల వృద్ధి
-50 వేలకు పైగా ఎకరాల్లో పెరిగిన సాగు విస్తీర్ణం
-పాడి రైతుకు అండగా గోకులాలు, నీటి తొట్టెల నిర్మాణం
-సీమ దాహార్తి తీర్చేందుకు సిద్ధమవుతున్న జేజేఎం-అమరజీవి జలధారలు
-13 నగర వనాలతో పట్టణాల్లో పచ్చదనం పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాయల సీమను రతనాల సీమగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార పథకాలతో సీమ గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారు. గడచిన రెండేళ్లలో సుమారు రూ. 8,022 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టారు. జల సంరక్షణ, రోడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా, రైతులకు అండగా ఉపాధి కల్పన, పాడి రైతులకు గోకులాల భరోసా, పండ్ల తోటల రైతులకు మద్దతుగా ఉద్యాన సాగు, పారిశుధ్యం తదితర అంశాల్లో ఉప ముఖ్యమంత్రివర్యుల దార్శనికతతో విశేష ఫలితాలు సాధించారు.
రాయలసీమ వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ తన శాఖల పరిధిలో కేటాయింపులు, పనుల అమలులో ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు స్వీకరించిన వెంటనే చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమం 13,326 పంచాయతీల్లో ఏకకాలంలో గ్రామసభల నిర్వహణ. ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గం మైసూరువారిపల్లి గ్రామాన్ని వేదికగా చేసుకున్నారు. ఫారం పాండ్స్ (పంట కుంటలు) రాష్ట్రవ్యాప్త నిర్మాణ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పుడిచర్ల గ్రామంలో శ్రీకారం చుట్టారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వీబీజీ-రాంజీ జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా రాయలసీమ ప్రాంతాన్నే వేదికగా ఎంచుకుని ఆ ప్రాంతం పట్ల తన దృక్పథాన్ని చాటుకున్నారు.
అభివృద్ధి పనుల విషయానికి వస్తే, ఒక్క ఫారం పాండ్ల నిర్మాణం ద్వారానే రాయలసీమ వ్యాప్తంగా అదనంగా 50 వేలకు పైగా ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. రైతులకు సుమారు రూ. 55 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. రాయలసీమలో జలసిరులు పారిస్తూ పవన్ కళ్యాణ్ పంటల సాగుకు అనుకూల పరిస్థితులను కల్పించారు. ఎనిమిది జిల్లాల పరిధిలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ (DWMA) ఆధ్వర్యంలో గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణ, జీవనోపాధిని మెరుగుపరచే కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశారు. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార కింద మూడు మెగా వాటర్ స్కీమ్ పథకాలను ముందుకు తీసుకువెళ్తున్నారు.
బీటలు వారిన నేలలతో ఉన్న రాయలసీమకు కొత్త జీవం పోస్తూ వేల సంఖ్యలో ఫారం పాండ్లు నిర్మించి, వేలాది ఎకరాల భూమిని సాగుకు అనుకూలంగా మార్చారు. పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా ఓర్వకల్లు మండలం పుడిచర్ల గ్రామంలో ఫారం పాండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మొదటి దశలో రాయలసీమ ఎనిమిది జిల్లాల పరిధిలో రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో 40,837 పంట కుంటలు నిర్మించాలన్న లక్ష్యాన్ని అధిగమించారు. రూ. 166.46 కోట్లు వెచ్చించి 41,614 వ్యవసాయ చెరువులు నిర్మించి లక్ష్యాన్ని మించి సాధించారు. రెండో దశలో ఇప్పటికే 29,902 ఫార్మ్ పాండ్లు మంజూరై వివిధ దశల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. రెండు దశల ఫారం పాండ్ల నిర్మాణంతో రాయలసీమ ప్రాంతంలో అదనంగా 50 వేలకు పైగా ఎకరాల భూమి సాగులోకి వచ్చింది.
• 15,000 మినీ గోకులాల నిర్మాణం
రాయలసీమ వ్యాప్తంగా ఉన్న పాడి రైతులకు అండగా గడచిన రెండేళ్లలో సుమారు 15 వేల మినీ గోకులాలు (వ్యక్తిగత పశువుల షెడ్లు) నిర్మించారు. మరో 3 వేల గోకులాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అందులో మొదటి దశలోనే లక్ష్యాన్ని అధిగమించి 9,708 మినీ గోకులాలను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. పల్లెపండుగ, పల్లెపండుగ 2.0 కార్యక్రమాల్లో కలిపి కేవలం వ్యక్తిగత పశువుల షెడ్ల నిర్మాణానికే రూ. 170 కోట్లకు పైగా వ్యయం చేశారు.
• హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ.. ఉపాధి హామీ పథకం భాగస్వామ్యం
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న కూటమి ప్రభుత్వ లక్ష్య సాధనలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో రైతులకు అండగా పండ్ల తోటలు, పూలు, మునగ వంటి ఉద్యాన పంటల సాగుకు సహకారం అందించారు. రెండు దశల్లో సుమారు 62 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉద్యాన పంటల సాగుకు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేశారు. నిరుపేద రైతులకు అండగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఎకరాకు ఏటా రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు ఆదాయం లభిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా రాయలసీమ ప్రాంతంలో 28 వేల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరింది.
• ముసలమడుగులో కుంకీల స్థావరం
అటవీశాఖ ద్వారా రాయలసీమ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకువెళ్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు, అన్నమయ్య తదితర రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో అడవి ఏనుగుల సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కుంకీ ఏనుగులకు పలమనేరు నియోజకవర్గం పరిధిలోని ముసలమడుగులో సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముసలమడుగు శిబిరం నుంచే కుంకీలు దాదాపు 15 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశాయి. కుంకీల రాకతో మానవ-ఏనుగుల ఘర్షణలు 75 శాతం తగ్గాయి. పంటల నష్టం కూడా 50 శాతం తగ్గింది.
పట్టణాలకు పచ్చని ఊపిరితిత్తులుగా పేరుగాంచిన నగర వనాలను రాయలసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే రూ. 26 కోట్లతో 13 నగర వనాల నిర్మాణం పూర్తి చేశారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం, పుట్టపర్తి సత్యసాయి ఎకో పార్క్, బద్వేల్, తిరుపతి కైలాసగిరి, అన్నమయ్య జిల్లాలో కోడూరు, నంద్యాల జిల్లా పరిధిలో డోన్ తదితర ప్రాంతాల్లో నగర వనాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
• పురోగతిలో రూ. 2,782 కోట్ల జేజేఎం-అమరజీవి జలధార పనులు
నిత్యం దాహార్తితో అల్లాడే రాయలసీమ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి జేజేఎం-అమరజీవి జలధార పథకాల పనులను ప్రత్యేక శ్రద్ధతో ముందుకు తీసుకువెళ్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న పులివెందుల మల్టీ విలేజ్ వాటర్ స్కీమ్ పనులను రూ. 280 కోట్లు వెచ్చించి పూర్తి చేస్తున్నారు. రూ. 480 కోట్లతో ప్రారంభమైన ఈ వాటర్ స్కీమ్ గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైంది. 2024 నాటికి జల్ జీవన్ మిషన్ గడువు ముగియడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
పవన్ కళ్యాణ్ కూటమి పెద్దలతో కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి జల్ జీవన్ మిషన్ గడువును మరో నాలుగేళ్లపాటు పొడిగించడంతో పులివెందుల తాగునీటి పథకం పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ పథకానికి సంబంధించి పూర్తయిన 96 శాతం పనుల్లో 56 శాతం పనులు  పవన్ కళ్యాణ్ చొరవతోనే పూర్తయ్యాయి. ఇప్పటికే పులివెందుల గ్రామీణ, సింహాద్రిపురం మండలాల పరిధిలో ప్రజలకు తాగునీరు అందుతోంది.
డోన్ మల్టీ విలేజ్ స్కీమ్‌ను కూడా గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలి వెళ్లగా, ఉప ముఖ్యమంత్రి రూ. 132 కోట్లతో పనులు చేపట్టారు. ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న ఈ పథకం ద్వారా మూడున్నర లక్షల మందికి తాగునీరు అందనుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రూ. 2,370 కోట్లతో చిత్తూరు మెగా వాటర్ గ్రిడ్ పథకానికి శ్రీకారం చుట్టారు. వచ్చే 30 ఏళ్లలో దాదాపు 25 లక్షల మందికి పైగా ప్రజల దాహార్తి తీర్చే ఈ పథకం పనులు వేగంగా సాగుతున్నాయి.
• రోడ్ల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణ
రాయలసీమ వ్యాప్తంగా ఎనిమిది జిల్లాల పరిధిలో గ్రామాల్లో అంతర్గత రహదారులు, గ్రామాల అనుసంధాన రహదారుల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టారు. పల్లెపండుగ, పల్లెపండుగ 2.0, సాస్కీ తదితర పథకాల ద్వారా రూ. 4,523 కోట్ల అంచనా వ్యయంతో 23,000కు పైగా రోడ్ల పనులు చేపట్టారు. అందులో 4,630 కిలోమీటర్లు బీటీ, 3,067 కిలోమీటర్ల సీసీ రోడ్లు ఉన్నాయి. మంజూరైన వాటిలో 2,582 కిలోమీటర్ల బీటీ, 2,655 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం కూడా పూర్తయ్యాయి. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. అందులో అత్యధికంగా వైఎస్ఆర్ కడప జిల్లాకు రూ. 876 కోట్లు మంజూరు కాగా, అనంతపురం జిల్లాకు రూ. 691 కోట్లు, తిరుపతి జిల్లాకు రూ. 521 కోట్లు, అన్నమయ్య జిల్లాలకు రూ. 518 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాకు రూ. 483 కోట్లు కేటాయించారు. ఇందులో పల్లెపండుగ ద్వారా నిర్మించిన రోడ్లు ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. పల్లెపండుగ 2.0, సాస్కీ తదితర పథకాల ద్వారా చేపట్టిన రోడ్లలో సగానికి పైగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ జిల్లాలో రోడ్ల నిర్మాణానికి రూ. 30 కోట్లు అదనపు నిధులు మంజూరు చేశారు. పుట్టపర్తికి రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు వీలుగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
రాయలసీమ ప్రాంత గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చేస్తూ పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణంతో పాటు గ్రామీణ పారిశుధ్య నిర్వహణకు కూడా పవన్ కళ్యాణ్ పెద్దపీట వేశారు. పలు గ్రామాల్లో మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం పూర్తి చేశారు. 50 వేలకు పైగా వ్యక్తిగత కంపోస్ట్ గుంతలు, భూగర్భ జలాలను రీచార్జ్ చేసే ఇంకుడు గుంతలు మరో 28 వేలకు పైగా నిర్మించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తూ, పథకాల అమలులో రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. వీబీజీ-రాంజీ పథకం ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ రాయలసీమ అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. వీటికి అదనంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎకో టూరిజం కేంద్రాలు, హస్త కళాకారుల కోసం వుడ్ బ్యాంకుల ఏర్పాటు తదితర కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిరంతర సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గ్రామీణ అభివృద్దికి కట్టుబడి ముందుకు వెళ్తుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *