విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
60వ డివిజన్ వాంబే కాలనీ డిస్నీలాండ్ ఎదురు ఉజ్వల భవిత ఫౌండేషన్ మరియు అను ఒమేగా హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నిత్య సువార్త ప్రార్థనా మందిరం ఆవరణలో మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా రవితేజ హాజరయ్యారు.
ఈ సందర్భంగా బొండా రవితేజ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం సేవా సంస్థలు, ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయడం ద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండి, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
మెగా వైద్య శిబిరంలో అను ఒమేగా హాస్పిటల్ వైద్య బృందం ఆధ్వర్యంలో నరాలు, కీళ్లు, ఎముకలు, మెదడు, గుండె సంబంధిత వ్యాధులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. గుండె సంబంధిత సమస్యలను గుర్తించేందుకు ఈసీజీ, ఎకో పరీక్షలను కూడా ఉచితంగా నిర్వహించి, వైద్యులు ప్రజలకు అవసరమైన వైద్య సలహాలు, సూచనలు అందించారు.
అలాగే వాసన్ ఐ కేర్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యలతో వచ్చిన వారికి పరీక్షలు చేసి తగిన వైద్య సూచనలు అందించారు. ఆశాజ్యోతి దంత వైద్యశాల వారి ఆధ్వర్యంలో ఉచిత దంత పరీక్షలు నిర్వహించి, పంటి మరియు చిగుళ్ల సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ మెగా వైద్య శిబిరానికి వాంబే కాలనీతో పాటు పరిసర ప్రాంతాల నుంచి సుమారు 500 మంది ప్రజలు హాజరై తమకు ఉన్న వివిధ అనారోగ్య సమస్యలకు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఒకే వేదికపై వివిధ విభాగాలకు చెందిన వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి రావడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని నిర్వాహకులు తెలిపారు. మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన వైద్యులు, వైద్య సిబ్బంది, దైవజనులు, నాయకులు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కంచి ధన శేఖర్, పాస్టర్ పల్లిశెట్టి మోహన్, పాస్టర్ జె. ప్రశాంత్ కుమార్, పాస్టర్ రవికుమార్, పాస్టర్ శామ్యూల్, పాస్టర్ గాంధీ ప్రసాద్, పాస్టర్ రత్నబాబు, పాస్టర్ చిన్నా, పాస్టర్ జాన్ వెస్లీ, పాస్టర్ ఇస్సాకు, పాస్టర్ మహేష్ ఇజ్రాయిల్, పాస్టర్ జీవసాగర్, పాస్టర్ విజయ రత్నం, పాస్టర్ రాజేష్ తదితర దైవజనులు, నాయకులు, అధికారులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News