కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రారంభించిన ‘విద్య–వసతి–వికాసం’ కార్యక్రమానికి విశేష స్పందన

-రూ.1 కోటి విరాళం ప్రకటించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మౌలిక వసతులు, అవసరమైన సౌకర్యాలను మెరుగుపరిచేందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రారంభించిన ‘విద్య–వసతి–వికాసం’ కార్యక్రమానికి దాతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జిల్లాలోని 155 ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 19 వేల మంది విద్యార్థులకు మెరుగైన విద్య, వసతి సౌకర్యాలు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.

ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.1 కోటి విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తంతో జిల్లాలోని 155 సంక్షేమ వసతి గృహాలకు అవసరమైన కంప్యూటర్లను కొనుగోలు చేసి అందజేస్తామని శుక్లా తెలిపారు.

రూ.1 కోటి విరాళం ప్రకటించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కలెక్టర్ హిమాన్షు శుక్లా కృతజ్ఞతలు తెలిపారు. దాతల నుంచి కార్యక్రమానికి మంచి స్పందన లభించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇప్పటివరకు ‘విద్య–వసతి–వికాసం’ కార్యక్రమానికి దాదాపు రూ.5 కోట్ల మేర విరాళాలు అందాయని తెలిపారు.

పేద, నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య, వసతి సౌకర్యాలు కల్పించేందుకు మరింత మంది దాతలు, సంస్థలు ముందుకు వచ్చి కార్యక్రమానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. విరాళాలు అందించదలచిన వారు జిల్లా కలెక్టర్ లేదా జిల్లా బీసీ సంక్షేమాధికారిని సంప్రదించవచ్చని తెలిపారు. అలాగే dbcweo.nlr.18@gmail.com, cpo_nlr@yahoo.co.in ఈ-మెయిల్ చిరునామాల ద్వారా కూడా సంప్రదించవచ్చని కలెక్టర్ వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *