-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశుధ్య నిర్వహణలో ఆధునిక వాహనాలు, యంత్రాలను విస్తృతంగా వినియోగించడం ద్వారా మెరుగైన పారిశుధ్య సేవలు అందించడంతో పాటు పారిశుధ్య కార్మికులపై పని భారాన్ని తగ్గిస్తూ నగర పరిశుభ్రతను మరింత మెరుగుపరుస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం తన పర్యటనలో భాగంగా బీఆర్టీఎస్ రోడ్, ఎర్రకట్ట రోడ్, కేటీ రోడ్, పాల ఫ్యాక్టరీ, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, వన్‌టౌన్ ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు.
పాల ఫ్యాక్టరీ వద్ద ఎక్స్కవేటర్ సహాయంతో తేలియాడే వ్యర్థాలను తొలగిస్తున్న పనులను కమిషనర్ పరిశీలించారు. నగరంలో పారిశుధ్య నిర్వహణలో భాగంగా రహదారుల శుభ్రత, కాలువల్లో పూడికతీత, వ్యర్థాల తొలగింపు తదితర పనులకు ఆధునిక వాహనాలు, యంత్రాలను వినియోగిస్తున్నామని తెలిపారు.
రహదారులను శుభ్రం చేసేందుకు స్వీపింగ్ మెషిన్లు, కాలువల్లో పూడికతీతకు నాలా మ్యాన్, ఎక్స్కవేటర్లు, యూజీడీ సిల్టింగ్ మెషిన్లు, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు మిస్ట్ వాహనాలు వంటి ఆధునిక పరికరాలను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చి వినియోగిస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు. వీటి వినియోగంతో పారిశుధ్య పనులు మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు కార్మికుల శ్రమను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ఆధునిక వాహనాలు, యంత్రాలను నిరంతరం వినియోగంలో ఉంచేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు. ఏదైనా వాహనం లేదా యంత్రంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లయితే వెంటనే మరమ్మతులు నిర్వహించి, తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని అన్నారు. తద్వారా పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా సేవలు అందించేందుకు వీలవుతుందని తెలిపారు.
అనంతరం వన్‌టౌన్‌లోని గాంధీ మహిళా కళాశాల సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను కమిషనర్ పరిశీలించారు. అన్న క్యాంటీన్‌కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్యాంటీన్లను తనిఖీ చేయాలని సూచించారు. తనిఖీల సమయంలో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ ఎన్. శ్రీనివాస్, డిసిపి చంద్రబోస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీనివాస్, గోపాలకృష్ణమూర్తి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News