అర్జీల ప‌రిష్కారంలో జిల్లాను ముందంజ‌లో నిల‌పాలి

– గ‌డువులోగా ప‌రిష్కారంతో పాటు నాణ్య‌త‌కూ పెద్ద‌పీట వేయాలి
– అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావులేదు
– జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మానికి 161 అర్జీలు
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్ర‌జా స్నేహ‌పూర్వ‌క ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌)కు అందే అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడంతో పాటు, నాణ్యమైన పరిష్కారం అందించి ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడం ద్వారా గ్రీవెన్స్‌ పరిష్కారంలో రాష్ట్రంలో జిల్లాను ముందంజలో నిలిపేందుకు కృషిచేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ
అధికారులను ఆదేశించారు.
క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ, డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం త‌దిత‌రుల‌తో క‌లిసి సోమ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో రెవెన్యూ 46, పోలీస్ 23, పురపాలక పట్టణ అభివృద్ధి 23, పంచాయతీరాజ్ 10 అర్జీల‌తో స‌హా మొత్తం 161 అర్జీలు అందాయి. కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ అర్జీదారుని సమస్య వాస్తవంగా పరిష్కరించబడిందా, ఆయన సంతృప్తి చెందారా అనేదే అర్జీ పరిష్కారానికి అసలు గీటురాయి అని స్పష్టం చేశారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు, సర్వేయర్లు అర్జీలను కేవలం కార్యాలయ స్థాయిలో పరిశీలించకుండా స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను పరిశీలించాలని, అర్జీదారులతో నేరుగా మాట్లాడి వాస్తవ పరిస్థితులను తెలుసుకుని, నిబంధనల మేరకు న్యాయబద్ధమైన, శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ప్రత్యేకించి జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, వాటి పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరిష్కారం అనంతరం కూడా అర్జీదారుడి సంతృప్తి స్థాయిని దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. ప్ర‌జ‌ల సంతృప్తి, ఐవీఆర్‌ఎస్‌ ఫీడ్‌బ్యాక్‌, పరిష్కార నాణ్యతను ప్రధాన ప్రమాణాలుగా తీసుకుని అర్జీలను పరిష్కరించి, గ్రీవెన్స్‌ పరిష్కారంలో జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలిపేందుకు అధికారులు సమష్టిగా కృషిచేయాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ ఆదేశించారు.
స్వ‌చ్ఛాంధ్ర‌లో జిల్లా మెర‌వాలి:
స్వ‌చ్ఛాంధ్ర‌-2026 అవార్డుల విష‌యంలో జిల్లాకు ఎక్కువ అవార్డులు సాధించేలా అధికారులు స‌మ‌ష్టిగా కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. ప్రతి శాఖ, స్థానిక సంస్థ తమ పరిధిలో చేపట్టిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, వాటి ఫలితాలను స్పష్టంగా నమోదు చేయాల‌న్నారు. కార్య‌క్ర‌మంలో పీజీఆర్ఎస్ నోడ‌ల్ అధికారి జి.జ్యోతి, వివిధ శాఖ‌ల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *