– ఇన్వెస్టర్స్ డెస్క్ ప్రతిపాదనలపై ప్రత్యేక దృష్టి
– జిల్లా ల్యాండ్ బ్యాంకు ఏర్పాటుకు సమష్టి కృషి
– డీఐఈపీసీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానమని.. పారిశ్రామికవేత్తలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషిచేస్తున్నామని, జిల్లా ల్యాండ్ బ్యాంకుపైనా ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పారిశ్రామిక విధానాల కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అనుమతులు, భూముల లభ్యత తదితరాలపై చర్చించారు. 2026, మే 26 నుంచి ఆగస్టు 29వ తేదీ వరకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా శాఖల వారీ పారిశ్రామిక అనుమతులకు సంబంధించి 258 దరఖాస్తులు రాగా.. వీటిలో ఇప్పటికే 226 దరఖాస్తులు ఆమోదం పొందాయని పరిశ్రమల శాఖ అధికారులు కలెక్టర్‌కు వివరించగా మిగిలిన దరఖాస్తులను కూడా త్వరితగతిన నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. పారిశ్రామిక అభివృద్ధి విధానం (2015-20), పారిశ్రామిక అభివృద్ధి విధానం (2020-23), పారిశ్రామిక అభివృద్ధి విధానం (2023-27), ఈడీపీ (2024-29) పథకాల కింద ఎంఎస్ఎంఈ రంగానికి అందించే పెట్టుబడి రాయితీ, వడ్డీ, విద్యుత్ బిల్లుల రీయింబర్స్మెంట్ వంటి ప్రోత్సాహకాలలో భాగంగా 22 క్లెయిమ్‌లకు రూ. 3.24 కోట్లు మేర ప్రతిపాదనలను తాజాగా చర్చించి డీఐఈపీసీ ఆమోదం తెలిపింది. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అవసరమైన భూముల లభ్యతపై వేగంగా సమాచారం అందించడంతో పాటు, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భూముల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి చొరవచూపుతున్నట్లు తెలిపారు. 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నవంబర్‌లో విశాఖపట్నంలో జరగనున్న నేపథ్యంలో విజయవాడలో అక్టోబర్‌లో రీజనల్ పార్టనర్షిప్ సమ్మిట్ జరుగుతుందని.. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు సమష్టిగా కృషిచేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
ర్యాంప్ కార్యక్రమం ద్వారా ప్రత్యేక చర్యలు:
ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత బలోపేతం చేసి, పోటీతత్వాన్ని పెంచేందుకు రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ (ర్యాంప్) కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 2న విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్‌షాప్ భారీ ఎత్తున జరగనుందని.. ఇందులో ఉత్సాహంగా పాల్గొనాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కె.బాబ్జి, వి.మురళీకృష్ణ (ఫాప్సియా), కనకదుర్గ (అలెప్), ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News