– 13 స్వర్ణం, 12 రజత పతకాలు కైవసం
– పతక విజేతలను అభినందించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
– మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తూ పతకాలు సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. క్రీడల్లో ప్రతిభను నిరూపించుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ వేదికలు, శిక్షణ, ప్రోత్సాహకాలు, వనరులను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని క్రీడాకారులకు సూచించారు.
2026, ఆగస్టు 24 నుంచి 27వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహించిన అమరావతి స్టేట్ లెవల్ ఛాంపియన్షిప్లో ఎన్టీఆర్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలోని క్రీడాకారులు వివిధ క్రీడాంశాల్లో పాల్గొని స్వర్ణ, రజత పతకాలు సాధించారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, యోగా విభాగాల్లో క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం పట్ల జిల్లా కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. పతకాలు సాధించిన క్రీడాకారులను సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాణించాలంటే ప్రతిభతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధన ఎంతో ముఖ్యమని.. రాష్ట్రస్థాయి పోటీల్లో సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆకాంక్షించారు.
కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.కోటేశ్వరరావు, కోచ్లు భాస్కర్ (బ్యాడ్మింటన్), నవీన్ కుమార్ (ఆర్చరీ), స్వామి (వెయిట్ లిఫ్టింగ్), ఇషాక్, చిరంజీవి (బాక్సింగ్), సంతోష్ (బాస్కెట్బాల్), ఆంజనేయులు, శిరీష (యోగా), క్రీడాకారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News