-దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి (DHPS) రాష్ట్ర జనరల్ సెక్రటరీ పిల్లి అంజయ్య
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వివిధ రకాల వైకల్యాలు ఉన్న వ్యక్తుల సంక్షేమం కోసం పాటుపడాల్సిన బాధ్యత కలిగినటువంటి, నిబద్ధతతో పనిచేయాల్సినటువంటి సాక్షాత్తు వికలాంగుల సంక్షేమ శాఖ పూర్తిగా అవినీతిమయంలో కూరుకుపోయింది. దీనికి ప్రధానంగా గత ఆరు నెలల క్రితం వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ సాక్షాత్తు ప్రెస్ మీట్ పెట్టి, ఆధారాలతో సహా వికలాంగుల సంక్షేమ శాఖలో 150 కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపించారు. వికలాంగుల సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ప్రెస్ మీట్‌లో చెప్పినటువంటి అంశాల పైన ఇప్పటివరకు ఎలాంటి విచారణ చేయకపోవడం నిజంగా వికలాంగుల సంక్షేమ శాఖ అధికారుల వైఖరిని, వికలాంగ సంక్షేమం పట్ల వాళ్లకు ఉన్నటువంటి నిబద్ధతను స్పష్టం చేస్తుంది.
దాంతో పాటుగానే నిబద్ధతతో కృషి చేయాల్సిన భవిష్యత్తులో జరగబోయే టెండర్లకి ముందుగానే, 10 సంవత్సరాల క్రితం రిటైరైనటువంటి సంపత్ అనే వ్యక్తి చేత చెక్కు పవర్ ఇచ్చి అతనితోటి రూ. 7 కోట్లకు పైగా చెక్కులు భవిష్యత్తులో జరగబోయే టెండర్లకు ప్రస్తుతం నిధులు విడుదల చేయడం అనేది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎలాంటి ఒక అకౌంటబిలిటీ లేని, రెస్పాన్సిబిలిటీ లేని రిటైర్డ్ ఉద్యోగికి చెక్కు పవర్ ఇవ్వడం, ఆ చెక్కు పవర్ ఉపయోగించి కోట్ల రూపాయల చెక్కులు భవిష్యత్తు టెండర్లకు ముందుగానే రాసి ఇవ్వడం వికలాంగ సంక్షేమ శాఖలో అవినీతికి నిదర్శనంగా మారుతోంది. అలాగే బ్రెయిలీ ప్రింటింగ్ నిర్వహణలో ఎలాంటి అనుభవం లేని రిటైర్ అయిన వ్యక్తిని, కేవలం పైరవీల కోసం శైలజ అనే వ్యక్తి అవసరాల కోసం బ్రెయిలీ ప్రింటింగ్ ప్రెస్‌లో పెట్టుకుని టెండర్లు, కమిషన్లు, పైరవీలు చేసుకుంటూ డిపార్ట్‌మెంట్‌ను, వికలాంగుల సంక్షేమాన్ని మరిచిపోయేటట్లు అవినీతిలో ముంచేశారు. అధికార యంత్రాంగం మొత్తం కూడా వికలాంగుల సంక్షేమాన్ని పక్కన పెట్టి “ఉన్నదంతా దోచుకో, దోచుకున్నంత దాచుకో, వికలాంగుల సంక్షేమం మర్చిపో” అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు.
వికలాంగుల సంక్షేమ శాఖలో అనేక సందర్భాల్లో అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ ఇప్పటికీ ఏ ఒక్క వ్యక్తి పైన కూడా ఎలాంటి చట్టపరమైన, శాఖపరమైన చర్యలు తీసుకోలేదంటే గత 15 సంవత్సరాలుగా వికలాంగుల సంక్షేమ శాఖలో అవినీతి రాజ్యం ఏ రకంగా పెరిగిపోతుందో అర్థమవుతుంది. దీనికి కారణం వికలాంగుల సంక్షేమ శాఖ అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే. కాబట్టి ఇప్పటికైనా వికలాంగుల సంక్షేమ శాఖ ఉన్నత అధికార యంత్రాంగం… గత 15 సంవత్సరాలుగా జరుగుతున్న అవినీతి టెండర్లు, ఆ టెండర్లలో ఇచ్చిన వస్తువులు, వాటి నాణ్యత ప్రమాణాలు, క్వాలిటీ కంట్రోల్ చెక్‌తో పాటు అకౌంటబిలిటీ, ఫండింగ్ మరియు ఎన్నికల సమయంలో కొన్ని వీల్‌చైర్ల టెండర్ల అవినీతి అక్రమాలపై, డిపార్ట్‌మెంట్‌లో పేరుకుపోయిన అవినీతి అక్రమాలు, రిటైర్డ్ ఉద్యోగుల నియామకాలు, వారికి చెల్లిస్తున్న జీతభత్యాల పైన మరియు గత 15 సంవత్సరాలుగా డిపార్ట్‌మెంట్‌లో టెండర్ల నిర్వహణ, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్న టెండర్ల ప్రక్రియ నిర్వహణ, నిధుల రిలీజ్ వంటి అనేక అంశాల పైన సీబీఐ ఎంక్వయిరీకి ఆదేశించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్. సత్యనారాయణ కి డీహెచ్‌పీఎస్ రాష్ట్ర నాయకులు రిప్రెజెంటేషన్ అందజేయడం జరిగింది. కళ్ళు లేని, కాళ్ళు లేని, నడవలేని, వినలేని, మాట్లాడలేని తదితర వైకల్యాలు ఉన్న వికలాంగుల సంక్షేమం కోసం, అభ్యున్నతి కోసం పనిచేయాల్సిన వికలాంగుల సంక్షేమ శాఖ ఉన్నత అధికార యంత్రాంగం మొత్తం వికలాంగుల అభివృద్ధిని మరిచిపోయి, సంక్షేమాన్ని పక్కనపెట్టి, ప్రభుత్వం విడుదల చేసిన నిధులన్నింటినీ దారి మళ్లించింది. వికలాంగుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులను, వికలాంగుల సంక్షేమ శాఖలో ఒకే అధికారి అయిన బి. శైలజ జేఎండీగా, ఎఫ్‌ఏసీగా, కమిషనర్‌గా తదితర అనేక బాధ్యతలు నిర్వహిస్తూ గత 15 సంవత్సరాలుగా దారి మళ్లిస్తూ వికలాంగుల సంక్షేమాన్ని అట్టడుగు పాతాళానికి తొక్కిపడేశారు. ఈ అధికారి అవినీతి అక్రమాలపై అనేక సందర్భాల్లో పేపర్లు, టీవీలలో వార్తలు వచ్చినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం తగు చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఆమె రిటైర్ అయిన తర్వాత కూడా ఆమె చెంచాలను పెట్టుకుని ఏడెచ్ఛగా అవినీతిని కొనసాగిస్తున్నారు.
సాక్షాత్తు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న ముత్తినేని వీరయ్య స్వయంగా వికలాంగుల సంక్షేమ శాఖలో 100 కోట్ల అవినీతి జరిగినట్టు ప్రెస్ మీట్ పెట్టి సాక్షాధారాలతో సహా బయటపెట్టినప్పటికీ, ప్రభుత్వం గానీ ప్రభుత్వ యంత్రాంగం గానీ ఇప్పటివరకు ఆమె పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. వికలాంగుల సమాజం అంతుపట్టని గందరగోళ పరిస్థితిలో, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలో ఉంది.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న, వికలాంగులకు రోజువారీ జీవితంలో ఉపయోగపడే ట్రై సైకిల్స్, వీల్ చైర్లు, సంక కర్రలు, బ్లైండ్ స్టిక్స్ ఉత్పత్తి చేసే టీసీపీసీ ప్రొడక్షన్ సెంటర్లను వికలాంగుల సంక్షేమ శాఖ నిర్వీర్యం చేసింది. కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాలను మూతపడేసే విధంగా చర్యలు తీసుకున్నారు. వికలాంగులకు ఇచ్చే ఎయిడ్స్ అండ్ అప్లయెన్సెస్ పరికరాలను ప్రభుత్వ సంస్థ అయిన ‘టీఎస్‌టీఎస్’ (TSTS) లోనే కొనాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, ఆ ఉత్తర్వులను పక్కనపెట్టి వికలాంగుల సంక్షేమ శాఖ గత 12 సంవత్సరాలుగా అర్ధరాత్రి రెండు గంటల వరకు టెండర్లు నిర్వహిస్తూ, కమిషన్ల కోసం కక్కుర్తి పడి నాసిరకమైన వస్తువులను సప్లై చేస్తూ, అవి సప్లై చేయకముందే 100% పేమెంట్ ఇవ్వడం దురదృష్టకరం.
గత సంవత్సరం త్రీ వీలర్ మోటార్ వెహికల్స్ 2,000 ఆర్డర్ చేస్తే టెండర్ దక్కించుకున్న ప్రైవేటు వ్యక్తి ఆ బండ్లను ఇప్పటివరకు 100% సప్లై చేయకపోయినా, అదే వ్యక్తికి తిరిగి వచ్చే సంవత్సరానికి సంబంధించిన రూ. 7 కోట్లు విడుదల చేయడం, అది కూడా 10 సంవత్సరాల క్రితం రిటైరైన ఔట్‌సోర్సింగ్ స్థానంలో పనిచేస్తూ ఎలాంటి అకౌంటబిలిటీ లేని వ్యక్తుల ద్వారా చెక్కులు రాసి పంపించడం వికలాంగుల సంక్షేమానికి పట్టిన దురదృష్టంగా వికలాంగ సమాజం భావిస్తుంది. డిపార్ట్‌మెంట్‌లో ఎంత అవినీతి అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవాల్సిందిగా వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ ని కోరడం జరిగింది.
వికలాంగుల సంక్షేమ శాఖలో ఎయిడ్స్ అండ్ అప్లయెన్సెస్ పరికరాల టెండర్ల ప్రక్రియను ప్రభుత్వ సంస్థల ద్వారా కాకుండా ప్రైవేటు వ్యక్తులతో అర్ధరాత్రి రెండు గంటల వరకు చేయాల్సిన అవసరం ఏంటి? అందులో వారి అవినీతి ఫలితం ఏంటో అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పటివరకు పంపిణీ చేసిన ఎయిడ్స్ అండ్ అప్లయెన్సెస్ పరికరాలపై ప్రభుత్వ ఇంజనీరింగ్, మోటార్ అండ్ వెహికల్ ఇంజనీరింగ్, టెక్నికల్ విభాగంతో క్వాలిటీ కంట్రోల్ చెక్ చేపించాలి. ఎందుకంటే సంక్షేమ శాఖ పంచిన మోటార్ వెహికల్స్, లాప్‌టాప్‌లు, బ్యాటరీ వెహికల్స్, బ్యాటరీ వీల్ చైర్లు నాసిరకంగా ఉన్నాయని రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల సమాజం ఆవేదన చెందుతోంది. సంగారెడ్డి కలెక్టర్ స్వయంగా ప్రిన్సిపాల్ సెక్రెటరీ కి నాసిరకం వస్తువులు సప్లై చేశారని చర్యలు తీసుకోవాలని లేఖ రాశారంటే వికలాంగుల సంక్షేమ శాఖ యంత్రాంగం అవినీతి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.
రిటైర్డ్ అయిన ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో తీసుకోవద్దని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, శైలజ ఆమెకు సంబంధించిన సంపత్ అనే వ్యక్తి పైన దాదాపు 70 మంది వికలాంగుల సంక్షేమ శాఖ ఉద్యోగులు అవినీతి పర్వం గురించి, కమిషన్ ఇస్తే గానీ పనిచేయరని 2017 జూన్ 3న ప్రిన్సిపాల్ సెక్రెటరీకి రిప్రెజెంటేషన్ ఇచ్చారు. అప్పటి సంక్షేమ శాఖ అధికారి శైలజ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా గత పది సంవత్సరాలుగా ఆయనకు చెక్కు పవర్ ఇస్తూ పనిచేయించారు. ఎలాంటి అకౌంటబిలిటీ లేని రిటైర్ అయిన ఉద్యోగికి స్టాక్ బుక్ పవర్ ఇవ్వడం వికలాంగుల సంక్షేమ శాఖలో మాత్రమే చూడగలుగుతున్నాం. ఇప్పటికీ సంపత్, రమేష్ లాంటి రిటైర్డ్ వ్యక్తులు శైలజ అండదండలతో కమిషన్ కక్కుర్తితో అవినీతిని కొనసాగిస్తున్నారు.
ఎన్నో ఉద్యమాలు చేసి, రిప్రెజెంటేషన్లు ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్టడీ సర్కిల్ మాదిరిగా వికలాంగులకు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసుకుంటే, దాన్ని నడపడానికి చేతగాక మూడు నెలల తర్వాత శైలజ ఆమె యంత్రాంగం మూసివేశాయి. దీనివల్ల నిరుద్యోగ వికలాంగులు కోచింగ్ తీసుకోలేక, 4 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఉద్యోగాలకు దూరమై మిగిలిపోతున్నారు. ప్రభుత్వ ఆస్తులు, స్థలాలు కబ్జాలకు గురవుతున్నా ఉన్నత అధికార యంత్రాంగం కళ్ళు మూసుకొని చూడనట్లు వ్యవహరించడం వల్ల విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు వికలాంగుల కార్పొరేషన్‌లో 147 మంది ఉద్యోగులు ఉంటే, ప్రస్తుతం కేవలం 21 మందే ఉన్నారు. ఈ 21 మందితో రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమం ఏ విధంగా సాధ్యమవుతుంది? 2015లోనే జస్టిస్ నరసింహారెడ్డి గారు ఎంత కేడర్ కావాలో రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పినా, కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఆ రిపోర్ట్ తయారు చేయలేదు.
అధికారులు కమిషన్ల కోసం కక్కుర్తి పడి వికలాంగుల సంక్షేమ హాస్టల్స్‌ను అవినీతి అడ్డాలుగా మార్చడంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లలో అవినీతిపై విజిలెన్స్ ఎంక్వయిరీ నడుస్తోంది. ఉద్దేశపూర్వకంగా అవినీతికి పాల్పడిన ఉద్యోగులను రిటైర్ అయిన తర్వాత కూడా ఔట్‌సోర్సింగ్‌లో తీసుకోవడం వల్ల సంక్షేమం మరింత కుంటిపడిపోతోంది. కాబట్టి అవినీతికి పాల్పడిన వారందరిపై తక్షణమే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, హాస్టళ్లలో అవసరమైన మాన్‌పవర్ కోసం పీజీలు, పీహెచ్‌డీలు చేస్తున్న నిరుద్యోగ వికలాంగులను తీసుకోవాలని కోరుతున్నాము.
కార్పొరేషన్ చైర్మన్ స్వయంగా 100 కోట్లు అవినీతి జరిగిందని ప్రెస్ మీట్ పెట్టడం, పేపర్లలో వార్తలు రావడం, 2017 నుంచే ప్రిన్సిపాల్ సెక్రెటరీకి లెటర్లు ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోనందున, వికలాంగుల సంక్షేమ శాఖలో జరుగుతున్న ఈ అవినీతిపై ఏసీబీ లేదా సీబీఐ ఎంక్వయిరీకి ఆదేశించాల్సిందిగా రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్. సత్యనారాయణ కి దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి (DHPS) రాష్ట్ర జనరల్ సెక్రటరీ పిల్లి అంజయ్య, ప్రెసిడెంట్ పి. రాజశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. స్వామి నాయక్ విజ్ఞప్తి చేయడం జరిగింది
Prajavartha Online Telugu News