-ప్రధానోపాధ్యాయులే నైపుణ్యాభివృద్ధికి శిల్పులు
-స్కిల్ ఎడ్యుకేషన్ వర్క్‌షాప్‌లో సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు, IAS
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులు తెస్తూ, ప్రభుత్వ పాఠశాలలను బెస్ట్ ఇన్స్టిట్యూషన్లుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రధానోపాధ్యాయులపైనే ఉందని, నైపుణ్యాభివృద్ధికి హెచ్ఎంలే శిల్పులని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, IAS అన్నారు.
విజయవాడలో ఆంధ్రా లయోలా కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన స్కిల్ ఎడ్యుకేషన్ పై నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాలల నిర్వహణ, నైపుణ్య విద్య, ఉపాధ్యాయుల బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీడీ బి. శ్రీనివాసరావు, IAS మాట్లాడుతూ… జాతీయ విద్యా విధానం- 2020లో భాగంగా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్మెంట్) అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని, పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లను సంపూర్ణంగా వాడుతూ, విద్యార్థులతో ప్రయోగాలు, ఎగ్జిబిషన్లు చేయించాలని ఆదేశించారు. బోధనను రీసోర్స్ సెంట్రిక్ నుండి “స్టూడెంట్ సెంట్రిక్”గా మార్చాలని, ప్రభుత్వం అందిస్తున్న మౌలిక వసతులతో పాటు క్రీడా పరికరాలు, లైబ్రరీ బుక్స్, పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలను కేవలం భద్రపరచకుండా విద్యార్థుల వికాసానికి పూర్తిస్థాయిలో సద్వినియోగించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను వాడుకుంటూ నూతన విద్యా సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.
పాఠశాలల్లో స్కిల్ ఎడ్యుకేషన్ బోధిస్తున్న టీచర్లకు పూర్తి 12 నెలల వేతనం చెల్లిస్తున్నామని, వేసవి సెలవుల్లో కూడా వారి సేవలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని హెచ్ఎంలకు సూచించారు. స్కిల్ టీచర్లను బోధనేతర పనులకు పరిమితం చేయకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులకు కేవలం పుస్తక పరిజ్ఞానం (థియరీ) మాత్రమే కాకుండా ప్రత్యక్ష శిక్షణ (హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్) ద్వారానే నైపుణ్యం వస్తుందన్నారు. దీనికోసం 6వ తరగతి నుంచే ప్రీ-ఒకేషనల్ నాలెడ్జ్ అందించడం జరుగుతోందన్నారు.
ఉపాధ్యాయుల నైపుణ్యాల పెంపు కోసం ప్రభుత్వం సింగపూర్, ఫిన్లాండ్ వంటి విదేశాలకు శిక్షణకు పంపుతోందని, అందువల్ల హెచ్ఎంలు, టీచర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. టీచర్లు విద్యార్థులకు “ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్”గా మారాలని, ప్రతి హెచ్ఎం పాఠశాలకు “కర్త, కర్మ, క్రియ”గా వ్యవహరిస్తూ సమాజంలో ఉపాధ్యాయ వ్యవస్థకు కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల నైపుణ్యాలను పెంచే కొత్త ఒకేషనల్ ట్రేడ్లు, స్కిల్స్‌పై సలహాలను పంపాలన్నారు.
నైపుణ్య విద్యతో ఉజ్వల భవిష్యత్తు: సీమ్యాట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.ఆర్. ప్రసన్న కుమార్
అనంతరం సీమ్యాట్ డైరెక్టర్ డా. ఎం.ఆర్.ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాభివృద్ధిని అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో ‘హబ్ అండ్ స్పోక్’ మోడల్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. సైకిల్ చక్రానికి హబ్ ఎంత కీలకమో, వృత్తి విద్యలో రిసోర్స్ సెంటర్లుగా ఉండే ‘హబ్ స్కూల్స్’ అంత ముఖ్యమని, వాటి నుంచి ‘స్పోక్ స్కూల్స్’ పూర్తి స్థాయిలో వనరులను అందిపుచ్చుకుంటూ హెచ్ఎంలు సమన్వయ సహకారంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలోని 1,599 పాఠశాలల్లో 11 రకాల సెక్టార్లలో ల్యాబ్‌లు, ఒకేషనల్ ట్రైనర్లతో శిక్షణ ఇస్తున్నామని, త్వరలో మరో 188 హబ్&స్పోక్ స్కూల్స్, ఐసీటీ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 9, 10 తరగతుల విద్యార్థులకు వారానికి కేటాయించిన 4 పీరియడ్లను కచ్చితంగా ఒకేషనల్ శిక్షణకే ఉపయోగించాలని కోరారు. వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన నైపుణ్యం గల యువత (స్కిల్డ్ యూత్)ను తయారు చేయడానికి కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ జీసీడీవో షేక్ సంథాని, స్టేట్ ఒకేషనల్ కోఆర్డినేటర్ సి.శ్రీలత, అసిస్టెంట్ కోఆర్డినేటర్ వై. ఉషారాణి, లెండ్ ఎ హ్యాండ్ ఇండియా ప్రతినిధులు, ఒకేషనల్ ట్రైనర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News