-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం అరండల్‌పేట పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ పింఛన్ లబ్ధిదారుల ఆధార్ వివరాలను పరిశీలించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టం (FRS) ద్వారా ధృవీకరణ అనంతరం పింఛన్ మొత్తాలను అందజేశారు. పింఛన్ లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి ప్రతి నెలా పింఛన్ సకాలంలో అందుతున్నదా, సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా, పింఛన్ పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అరండల్‌పేట ప్రాంతానికి చెందిన అల్లాడి మీనాక్షి, దొంగర తిరుపతమ్మ, నాగులపల్లి సతీష్, చీమకుర్తి స్వరాజ్యం తదితర పింఛన్ లబ్ధిదారులకు కమిషనర్ ధ్యానచంద్ర స్వయంగా FRS ద్వారా ధృవీకరణ చేసి పింఛన్ మొత్తాలను పంపిణీ చేశారు.
పింఛన్ పంపిణీ ప్రక్రియపై లబ్ధిదారుల నుంచి వివరాలు తెలుసుకున్న కమిషనర్, పింఛన్లు సకాలంలో అందుతున్నాయా, పంపిణీలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయా అనే అంశాలను పరిశీలించారు. లబ్ధిదారులు ప్రతి నెలా పింఛన్ సకాలంలో అందుతున్నదని, ఎటువంటి ఇబ్బందులు లేవని తెలియజేయడంతో కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సకాలంలో పింఛన్ అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మధ్యాహ్నం మూడు గంటల వరుకు, సర్కిల్ వన్ పరిధిలో 19,234 పెన్షన్ లకు గాను 17,938, సర్కిల్ 2 పరిధిలో 25,055 పెన్షన్ లకు గాను 23,239, సర్కిల్ 3 పరిధిలో 19,652 పెన్షన్ లకు గాను 18,083, మూడు సర్కిల్స్ పరిధిలో మొత్తం 63,941 పెన్షన్ లకు 59,260 పెన్షన్ల పంపిణీ చేశారని, అంటే దాదాపు 92% పెన్షన్ పంపిణీ చేశారని తెలిపారు.
ఈ పర్యటనలో జోనల్ కమీషనర్ కె. ప్రభుదాస్, సీడిఓ జగదేశ్వరి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News