Breaking News

ఏపీలో తొలిసారిగా క్యాన్సర్‌ రోగులకు జన్యు పరీక్షలు

-గుంటూరు GGH నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌లో ప్రత్యేక ప్రయోగశాల
-రోగులకు ఉచితంగా అధునాతన పరీక్షలు
-రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్లకు జన్యు మార్పుల గుర్తింపు
-22న ప్రారంభించనున్న మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌
-భవిష్యత్తులో అమరావతి క్వాంటం వ్యాలీలో పూర్తి స్థాయి కేంద్రం ఏర్పాటుపై ప్రతిపాదన
-సీఎం చంద్రబాబు నేతృత్వంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులని మంత్రి వెల్లడి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా క్యాన్సర్‌ రోగులకు అధునాతన జన్యు పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. గుంటూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌లో 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.2.5 కోట్ల పెట్టుబడితో ప్రత్యేక జన్యు పరీక్షల ప్రయోగశాలను ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన పరికరాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. తొలిదశలో రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రోగులకు పరీక్షలు నిర్వహించనున్నారు.
క్యాన్సర్‌ రోగుల నుంచి సేకరించిన నమూనాలను ప్రత్యేకంగా పరీక్షించి కణాల్లోని జన్యు మార్పులను గుర్తిస్తారు. వాటి ఆధారంగా రోగికి ఏ చికిత్స అవసరమో వైద్యులు నిర్ణయించేందుకు వీలవుతుంది. రోగ నిర్ధారణ నుంచి చికిత్స, తదుపరి పర్యవేక్షణ వరకు ఈ విధానాన్ని ఉపయోగించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఆస్ట్రాజెనెకా సంస్థ, స్ట్రాండ్‌ లైఫ్‌ సైన్సెస్‌ సంస్థల భాగస్వామ్యంతో చేపడుతున్నారు. గుంటూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌లో ఏర్పాటు చేస్తున్న ప్రయోగశాలను ఈ నెల 22న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం సూక్ష్మస్థాయి జన్యు మార్పు (mutations) పరీక్షల కోసం కొందరు రోగుల నమూనాలను బెంగళూరు, ముంబయి వంటి నగరాలకు పంపించాల్సి వస్తోందని, ఈ ఇబ్బందిని తొలగించి రాష్ట్రంలోనే అధునాతన పరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలన్నదే లక్ష్యమని మంత్రి తెలిపారు. జన్యు పరీక్షలను రోగులకు ఉచితంగా అందించనున్నామని, బయట ప్రైవేటు కేంద్రాల్లో ఒక్కో పరీక్షకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు, పూర్తి స్థాయి పరీక్షలకు రూ.75 వేల వరకు ఖర్చవుతున్న నేపథ్యంలో ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అవసరమైన పరికరాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని, తొలిదశలో రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రోగులకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు.

రెండేళ్లలో 2 వేల నమూనాల పరీక్ష

గుంటూరు సర్వజన ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న ప్రయోగశాలను స్ట్రాండ్‌ లైఫ్‌ సైన్సెస్‌ సంస్థ సాంకేతిక సహకారంతో అభివృద్ధి చేయనుంది. రెండేళ్లలో సుమారు 2 వేల నమూనాలను పరీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్ట్రాజెనెకా సంస్థ 1,000 మంది రొమ్ము క్యాన్సర్‌, 1,000 మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రోగులకు నిర్వహించే జన్యు పరీక్షల ఖర్చును భరిస్తుంది.

క్యాన్సర్‌ కణాల్లో జన్యు మార్పుల గుర్తింపు.. మందుల సిద్ధం

రొమ్ము క్యాన్సర్‌ లో బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ2, ఇతర, ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో ఈజీఎఫ్‌ఆర్‌, కేఆర్‌ఏఎస్‌, ఎన్‌ఆర్‌ఏఎస్‌, బీఆర్‌ఏఎఫ్‌, ఇతర మార్పులను పరిశీలిస్తారు. జన్యు పరీక్షల్లో బయటపడిన మార్పులను బట్టి ప్రత్యేక మందులను
సిద్ధం చేస్తారు.

అమరావతి క్వాంటం వ్యాలీలో పూర్తి స్థాయి కేంద్రం

గుంటూరులోని ప్రయోగాత్మక ప్రయోగశాల తర్వాత అమరావతి క్వాంటం వ్యాలీలో పూర్తి స్థాయి జన్యు పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనిi ప్రతిపాదించారు. అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించేలా దీనిని రాష్ట్రస్థాయి కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్ర జన్యు సమాచార వ్యవస్థతోనూ అనుసంధానిస్తారు.

కృత్రిమ మేధస్సు ఉపయోగించి

జన్యు సమాచారం, కృత్రిమ మేధస్సు, ఆధునిక వైద్య పరిశోధనలను అనుసంధానించడం దీర్ఘకాలిక లక్ష్యం. సేకరించే సమాచారాన్ని భవిష్యత్తులో వ్యక్తికి అనుగుణమైన చికిత్సలు, వైద్య పరిశోధనలు, ఆధునిక ఔషధ పరిశోధనలకు ఉపయోగించనున్నారు.

14 రకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించే దిశగా

భవిష్యత్తులో రక్తంలో కనిపించే కొన్ని మార్పులను గుర్తించడం ద్వారా 14 రకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించే పరీక్షను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. దీనిని పెద్ద సంఖ్యలో ప్రజలకు పరీక్షలు నిర్వహించే స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
రాష్ట్రస్థాయిలో జన్యు సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదన కూడా ఉంది. ఆరోగ్యవంతుల జన్యు సమాచారంతో పాటు అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారి సమాచారాన్ని సేకరించి భద్రపరుస్తారు. భవిష్యత్తులో వ్యాధులపై పరిశోధనలు, కొత్త పరీక్షలు, మెరుగైన చికిత్స విధానాల రూపకల్పనకు దీనిని ఉపయోగిస్తారు.

60000 వరకు ఛాతీ ఎక్స్‌రేలు

క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించే విధానాన్ని ప్రాజెక్టులో భాగంగా బలోపేతం చేయనున్నారు. రొమ్ము క్యాన్సర్‌కు రొమ్ము పరీక్షా పరికరాలను, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ఛాతీ ఎక్స్‌రేలను ఉపయోగిస్తారు. ఊపిరితిత్తుల చిత్రాల్లో అనుమానిత మార్పులను కృత్రిమ మేధస్సుతో గుర్తిస్తారు. రెండేళ్లలో 60 వేల వరకు ఛాతీ ఎక్స్‌రేలను ఈ విధానంలో పరిశీలించేలా ప్రణాళిక ఉంది.
వైద్య విద్య సంచాలకులు ఏ. విష్ణువర్ధన్‌ మాట్లాడుతూ.. గుంటూరు సర్వజన ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న జన్యు పరీక్షల ప్రయోగశాల ప్రయోగాత్మక ప్రాజెక్టులో భాగమని తెలిపారు. తొలిదశలో రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రోగులకు పరీక్షలు నిర్వహిస్తామని, క్యాన్సర్‌ కణాల్లోని జన్యు మార్పులను గుర్తించడం ద్వారా వైద్యులు తగిన చికిత్సను నిర్ణయించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *