-రూ.754.1 కోట్ల ఆదాయం.. 2,113 షాపుల నుంచి చెల్లింపులు
-పునరుద్ధరణ ప్రక్రియలో 1,076 షాపులు పూర్తి.. లక్ష్యం చేరుకుంటామని అధికారుల ధీమా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో 2026–27 ఎక్సైజ్ సంవత్సరానికి ఏ4 మద్యం షాపుల పునరుద్ధరణకు మంచి స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,650 ఏ4 షాపుల్లో 2,931 షాపులు, అంటే దాదాపు 80 శాతం, పునరుద్ధరణకు ఆసక్తి చూపాయి. గడువు సెప్టెంబరు 21తో ముగియనుండటంతో అధికారులు మిగిలిన ప్రక్రియను వేగవంతం చేశారు.
పునరుద్ధరణకు ముందుకొచ్చిన 2,931 షాపుల్లో 1,458 షాపులు పూర్తిగా చెల్లింపులు పూర్తి చేశాయి. మరో 655 షాపులు పాక్షికంగా చెల్లింపులు చేశాయి. అలాగే 382 షాపులు పూర్తి మొత్తాన్ని చెల్లించినప్పటికీ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే 798 దరఖాస్తులు సమర్పించగా, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు (డీపీఈవోలు) పరిశీలనలో ఉన్నాయి. మరో 278 షాపులకు డీపీఈవోలు ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,076 షాపుల పునరుద్ధరణ ప్రక్రియ పూర్తయింది.
మొత్తం 3,650 షాపులతో పోలిస్తే ఇప్పటివరకు పునరుద్ధరణ పురోగతి గణనీయంగా ఉంది. మొత్తం 2,113 షాపుల నుంచి చెల్లింపులు అందగా, ఇప్పటివరకు రూ.754.1 కోట్లను ఎక్సైజ్ శాఖ వసూలు చేసింది. ఇంకా రూ.747.9 కోట్లు వసూలు కావాల్సి ఉంది. గడువు ముగియడానికి ఒక్కరోజు మాత్రమే సమయం ఉండటంతో పెండింగ్‌లో ఉన్న చెల్లింపులు, దరఖాస్తుల సమర్పణ, ఆమోద ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన స్పందన ఆశాజనకంగా ఉందని, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని గడువులోగా సాధిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News