-మెరిట్‌తో ఉద్యోగాలు సాధించిన డీఎస్సీ టీచర్లపై వైసీపీ మూకల దాడి దుర్మార్గం.. ప్రజాస్వామ్యానికి మచ్చన్న మాజీ మంత్రి
-సమాజంలో అశాంతి రేపాలనే కుట్రతో సజ్జల ఆదేశాలతోనే బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లతో భౌతిక దాడులకు పాల్పడ్డారు
-టీచర్లను ఏ బ్రాండ్ ఎక్కువ తాగుతున్నారో చెప్పాలంటూ మందు షాపుల దగ్గర కాపలా పెట్టిన నీచ సంస్కృతి గొడ్డలి పార్టీదని విమర్శ
గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
మెరిట్‌తో ఉద్యోగాలు సాధించిన డీఎస్సీ ఉపాధ్యాయులపై భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడిలోని తన కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. గురువులపై రాళ్లు, రాడ్లు, కర్రలతో దాడులను తీవ్రంగా ఖండించారు. ఏ బ్రాండ్ ఎక్కువ తాగుతున్నారో చెప్పాలంటూ మందు షాపుల దగ్గర టీచర్లను కాపలా పెట్టిన నీచ సంస్కృతి గొడ్డలి పార్టీదని
సమాజంలో అశాంతి రేపాలనే కుట్రతో సజ్జల ఆదేశాలతోనే బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లతో భౌతిక దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్న గొడ్డలి పార్టీ అధ్యక్షుడు సిబిఐ విచారణ అంటూ మాట్లాడడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.
మైదానాల్లో ఏళ్ల తరబడి శ్రమించి సాధించిన సర్టిఫికెట్లతో మెరిట్‌తో ఉద్యోగాలు పొందిన టీచర్లను మానసికంగా వేధించడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఉమా విమర్శించారు. జాతీయ స్థాయిలో రాణించి, రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిన క్రీడాకారుల ప్రతిభను ‘ఫేక్’ అంటూ అవమానించడం వారి కష్టాన్ని అవమానించడమేనన్నారు. డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ప్రచారానికి అభ్యర్థులు ఆధారాలతో తమ వద్ద ఉన్న ఒరిజినల్ సర్టిఫికెట్లు, క్రీడా విజయాలకు సంబంధించిన ఆధారాలను చూపి సమాధానం చెప్పినా, దుష్ప్రచారం కొనసాగించడం వారి అహంకారానికి నిదర్శనం అన్నారు. గతంలో ప్రభుత్వమే జారీ చేసిన సర్టిఫికెట్లను ఇప్పుడు ఫేక్ అంటూ ఆరోపణలు చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు
శాప్ సిబ్బంది, విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేయడం ప్రభుత్వ వ్యవస్థను భయపెట్టే ప్రయత్నమని ఉమా అన్నారు. టీచర్లు తల పగలగొట్టి సభ్య సమాజం తలదించుకునేలా భాష బూతు భాషతో దూషించి దాడులకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ఒక్క మెగా డీఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగులను నిరాశకు గురిచేసిందని ఉమా విమర్శించారు. డీఎస్సీని అడ్డుకునేందుకు వైసిపి వందల కేసులు వేసినా న్యాయపరమైన సవాళ్లు అధిగమించి మెగా డీఎస్సీ నిర్వహించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. “డీఎస్సీ అంటే తెలుగుదేశం.. తెలుగుదేశం అంటే డీఎస్సీ” అని పేర్కొంటూ, ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యత అని ఉమా అన్నారు. వైసీపీ అరాచక రాజకీయాలను ప్రజలు సహించేందుకు సిద్ధంగా లేరని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయంతో గొడ్డలి పార్టీకి బుద్ధి చెప్పబోతున్నారని ఉమా అన్నారు.
Prajavartha Online Telugu News