గ‌తంకంటే ఘ‌నంగా ద‌స‌రా మహోత్స‌వాలు

– సామాన్య భక్తులకు పెద్ద‌పీట వేస్తూ ఏర్పాట్లు
– ఉచిత ద‌ర్శ‌నాల‌తో పాటు ప్ర‌సాదాల పంపిణీ
– ఏఐ సాంకేతిక‌త అనుసంధానంతో భ‌క్తుల భ‌ద్ర‌త‌కు భ‌రోసా
– ఏర్పాట్ల‌లో ఎక్క‌డా లోటుపాట్లు లేకుండా నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌
– 24 గంట‌లూ సేవ‌లందించే క‌మాండ్ కంట్రోల్ కేంద్రం (సీసీసీ)
– స‌మీక్షా స‌మావేశంలో దేవాదాయ శాఖ కార్య‌ద‌ర్శి కె.క‌న్న‌బాబు
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, సీపీ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర‌, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ కె.రామ‌చంద్ర‌మోహ‌న్‌, దుర్గ‌గుడి ఈవో వీకే శీనా నాయ‌క్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అక్టోబ‌ర్ 10 నుంచి 20వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న శ్రీ దుర్గా మ‌ల్లేశ్వ‌ర స్వామివార్ల దేవస్థానం శ్రీ ప‌రాభ‌వనామ సంవ‌త్స‌ర ద‌స‌రా మ‌హోత్స‌వాల‌ను గతంలో కంటే ఘనంగా, భక్తులకు మరింత సౌకర్యవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు దేవాదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు తెలిపారు. ఏఐ సాంకేతికతను అనుసంధానం చేసి భక్తుల భద్రతకు మరింత భరోసా కల్పించడంతో పాటు, ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారి దర్శనం త్వరగా, సౌకర్యవంతంగా లభించేలా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
సోమ‌వారం జిల్లా క‌లెక్ట‌రేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో దేవాదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, సీపీ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర‌, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ కె.రామ‌చంద్ర‌మోహ‌న్‌, దుర్గ‌గుడి ఈవో వీకే శీనా నాయ‌క్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక‌త‌ను ఉప‌యోగించుకుంటూ చేస్తున్న ఏర్పాట్ల‌పై చ‌ర్చించారు. ఏఐ ఆధారిత ప్ర‌త్యేక మొబైల్ అప్లికేష‌న్, అందుబాటులో ఉన్న సేవ‌ల‌ను ప‌రిశీలించారు. క్యూలైన్లోని భక్తుల‌కు అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి ఎంత స‌మ‌యం ప‌డుతుందో ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేసేలా ప్ర‌తి 200 మీట‌ర్ల‌కు చేస్తున్న ఏర్పాట్ల‌తో పాటు డిజిట‌ల్ స్క్రీన్లు, ఏఐ కెమెరాలు, డ్రోన్ల సేవ‌లు త‌దిత‌రాల‌పై చ‌ర్చించారు. 22 పార్కింగ్ ప్రాంతాల‌తో మూడు హోల్డింగ్ ఏరియాల్లో ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకునేలా చేస్తున్న ఏర్పాట్ల‌తో పాటు స్మార్ట్ ల‌డ్డూ వెండింగ్ మెషీన్ల ఏర్పాటుపైనా చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా కె.క‌న్న‌బాబు మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, దర్శన మార్గాలు, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు, పారిశుధ్యం, రవాణా తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఉచిత దర్శనాల విషయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు, భక్తులకు ప్రసాదాల పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. భక్తుల భద్రత, సౌకర్యాల విషయంలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణను సమన్వయం చేసేందుకు దుర్గాఘాట్ స‌మీపంలో 24 గంటలూ పనిచేసే కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుండ‌గా.. క్షేత్ర‌స్థాయి నుంచి అందే సమాచారాన్ని ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ, తక్షణమే స్పందించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. భక్తుల నుంచి వచ్చే ఫిర్యాదులు, సూచనలపై కూడా వేగంగా స్పందించేలా చొర‌వ చూపాల‌న్నారు.
సామాన్య భ‌క్తుల‌కు ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా వీఐపీ, ప్రోట్‌కాల్ ద‌ర్శ‌నాలు, జ‌న‌ర‌ల్ ప‌బ్లిక్‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాల‌కు చేస్తున్న ఏర్పాట్లు, వివిధ ర‌కాల పాస్‌ల జారీ, విభిన్న ప్ర‌తిభావంతులు, వ‌యోవృద్ధుల‌కు బ్యాట‌రీ వాహ‌నాల ఏర్పాటు, అన్న ప్ర‌సాదం, ల‌డ్డూ ప్ర‌సాదం పంపిణీ త‌దిత‌రాల‌కు చేస్తున్న ఏర్పాట్ల‌ను ఆల‌య అధికారులు వివ‌రించారు. ఖ‌డ్గ‌మాల‌, కుంకుమార్చ‌ణ‌, చండీహోమం సేవ‌ల‌కు చేస్తున్న ఏర్పాట్ల‌ను కూడా వివ‌రించారు. అదేవిధంగా నివేదన‌లు, ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష సేవ‌ల గురించి వైదిక క‌మిటీ స‌భ్యులు తెలిపారు. వివిధ శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యంతో పాటు ఆయా శాఖ‌ల అధికారులు, సిబ్బందికి కేటాయించే విధుల‌కు సంబంధించి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ వివ‌రించారు. మొత్తంమీద 20 ల‌క్ష‌ల వ‌ర‌కు భ‌క్తులు వ‌చ్చినా ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. భ‌క్తుల భ‌ద్ర‌త‌కు చేస్తున్న ఏర్పాట్లు, క్యూఆర్ కోడ్ ఆధారిత చైల్డ్ ట్రాకింగ్ సిస్ట‌మ్ గురించి పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు వివ‌రించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, మొబైల్ టాయిలెట్లు త‌దిత‌ర సౌక‌ర్యాల‌కు సంబంధించి న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర వివ‌రించారు. అక్టోబ‌ర్ 16 మూలాన‌క్ష‌త్రం రోజున సాయంత్రం 4 గంట‌లకు గౌర‌వ ముఖ్య‌మంత్రి ఆల‌యానికి రానున్న నేప‌థ్యంలో చేయాల్సిన ఏర్పాట్ల‌పైనా స‌మావేశంలో చ‌ర్చించారు.
స‌మావేశంలో వైదిక కమిటీ స‌భ్యులు ఎల్.దుర్గా ప్రసాద్, కె.రవికుమార్, ఆల‌య ఈఈలు ఎల్.రమాదేవి, బి.రాంబాబు, డీవీ భాస్కర్, ఏఈవో ఎన్.రమేష్ బాబు, డా. కె.గంగాధర్, పి.చంద్రశేఖర్, వీఎంసీ చీఫ్ఇంజ‌నీర్ పి.స‌త్య‌కుమారి త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *