-పోటీల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
-క్రీడాకారులకు మెరుగైన వసతులు, వైద్య–భద్రతా సదుపాయాలు కల్పించాలి
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో 51వ సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 4, 2026 వరకు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. భరణి తెలిపారు. బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ ఏర్పాట్లపై సోమవారం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలోని స్పోర్ట్స్ భవన్‌లో సంబంధిత శాఖల అధికారులతో ఎస్.భరణి సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరంలోని పలు క్రీడా వేదికల్లో పోటీలను నిర్వహించనున్నట్లు ఎస్.భరణి తెలిపారు. ప్రధానంగా ఆర్‌టీసీ కాలనీ – మేరీస్ స్టెల్లా కాలేజ్ ఇండోర్ స్టేడియం, పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం, పటమట – కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం నందు సంబంధిత ఇతర క్రీడా వేదికల్లో పోటీలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పోటీల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోటీల నిర్వహణలో వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రతి శాఖ తరఫున ఒక నోడల్ అధికారిని తక్షణమే నియమించి బాధ్యతలు అప్పగించాలని ఎస్. భరణి ఆదేశించారు. అన్ని శాఖల నోడల్ అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లతో కూడిన సమగ్ర కాంటాక్ట్ జాబితాను సిద్ధం చేసి అందుబాటులో ఉంచాలని సూచించారు. వేదికల వద్ద పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్. భరణి సూచించారు. వేదికల వద్ద చెత్త సేకరణకు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి వాహనాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మేరీస్ స్టెల్లా కాలేజ్ సహా అన్ని వేదికల వద్ద అవసరమైన సంఖ్యలో పారిశుధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. టోర్నమెంట్ పూర్తయ్యే వరకు వేదికల వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లు, ప్రచార సామగ్రికి ఎలాంటి ఆటంకం కలగకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో కూడా మ్యాచ్‌లు నిర్వహించనున్న నేపథ్యంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి వేదిక వద్ద మూడు బయో టాయిలెట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పటమట ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ కోర్టు లైటింగ్‌ను బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌కు అనుగుణంగా సెప్టెంబర్ 25 నాటికి సిద్ధం చేయాలని ఎస్.భరణి సూచించారు. ఫ్లడ్‌లైట్లు, అదనపు విద్యుత్ లోడ్, ఇతర లైటింగ్ సదుపాయాలను అవసరమైన మేరకు మెరుగుపరచాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు విద్యుత్ శాఖ, సంబంధిత సాంకేతిక సిబ్బంది వేదికల వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్రీడాకారుల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్. భరణి సూచించారు. ప్రతి వేదిక వద్ద రెండు అంబులెన్సులు, వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. క్రీడాకారుల వయస్సు ధ్రువీకరణకు అవసరమైన సందర్భాల్లో ఎక్స్‌రే సదుపాయంతో కూడిన వైద్య సేవలను, డెంటిస్టులు, ఆర్థోపెడిక్ వైద్యులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ప్రముఖ ఆసుపత్రులతో సమన్వయం చేసుకుని వారి సేవలను అందుబాటులో ఉంచాలని సూచించారు.
మేరీస్ స్టెల్లా కాలేజీలోని వంట ప్రదేశం, పటమట ఇండోర్ స్టేడియం తదితర ప్రాంతాల్లో అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లను పూర్తిస్థాయిలో పరిశీలించాలని అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునే నిష్క్రమణ మార్గాలను ముందుగానే గుర్తించి, అవి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల ప్రాంగణాల్లో నిర్వహించే మ్యాచ్‌ల కారణంగా విద్యార్థుల తరగతులకు ఎలాంటి అంతరాయం కలగకుండా షెడ్యూల్ రూపొందించాలని ఎస్. భరణి సూచించారు. మ్యాచ్‌లను ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం వేళల్లో నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. మైక్ సౌండ్, అనౌన్స్‌మెంట్లు తక్కువ శబ్దంతో ఉండేలా చూసుకోవాలని, పాఠశాలల విద్యా కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. టోర్నమెంట్‌కు సంబంధించిన మ్యాచ్ షెడ్యూల్‌ను ముందుగానే పాఠశాల యాజమాన్యాలకు లేఖ ద్వారా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. టోర్నమెంట్‌కు సంబంధించిన తాజా వివరాలు, మ్యాచ్‌ల నిర్వహణ, ఫలితాలు తదితర సమాచారాన్ని మీడియాకు క్రమం తప్పకుండా అందించాలని ఎస్. భరణి సూచించారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, సాయంత్రం 5 గంటలకు డీఎస్‌డీఓ, బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు మీడియా ప్రతినిధులకు టోర్నమెంట్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జాతీయ స్థాయి క్రీడా పోటీలు విజయవంతంగా నిర్వహించడం ద్వారా విజయవాడ నగరానికి మంచి గుర్తింపు వచ్చేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్. భరణి సూచించారు. క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రత, వైద్య సేవలు, పారిశుధ్యం, విద్యుత్, రవాణా తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, టోర్నమెంట్ ప్రారంభానికి అన్ని వేదికలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కాకర్ల కోటేశ్వరరావు, డిఇఓ చంద్రకళ, డి ఎం హెచ్ ఓ డా.ఏ. శ్రవణ్ బాబు, ఎలక్ట్రికల్ ఏడి రామకృష్ణ, బాస్కెట్ బాల్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ చక్రవర్తి, జిల్లా అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్, మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపక శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News