గురజాడ ఆశయాలు సమాజ మార్పుకు నేటికీ స్ఫూర్తిదాయకం…

-ఎన్టీఆర్ ఆత్మగౌరవ స్ఫూర్తి.. చంద్రబాబు దార్శనికత.. పవన్ కళ్యాణ్ ప్రజాసంకల్పం.. లోకేష్ యువ నాయకత్వంతో తెలుగు వైభవానికి నూతన దిశ
-భారతీయ భాషలు, సంస్కృతుల పరిరక్షణకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి అభినందనీయం ….
-రాష్ట్రవ్యాప్తంగా గురజాడ జయంతి కార్యక్రమాలకు విశేష స్పందన: ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్

గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించినట్లు కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ తెలిపారు.

గొల్లపూడిలోని కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గురజాడ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గురజాడ అప్పారావు కేవలం మహాకవి మాత్రమే కాదని, సాహిత్యాన్ని సామాజిక సంస్కరణలకు, ప్రజా చైతన్యానికి సాధనంగా మలిచిన మహోన్నత సంస్కర్త అని కొనియాడారు. సమాజంలో నెలకొన్న కన్యాశుల్కం, బాల్యవివాహాలు, స్త్రీలపై వివక్ష, మూఢనమ్మకాలు, సామాజిక అసమానతల వంటి సమస్యలను తన రచనల ద్వారా ప్రశ్నించి సంస్కరణలకు మార్గం సుగమం చేశారని పేర్కొన్నారు.

“దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అనే గురజాడ సందేశం నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తోందని, మానవతా విలువలు, సామాజిక బాధ్యత, జాతీయ చైతన్యానికి అది ప్రతీకగా నిలిచిందని అన్నారు.

గిడుగు రామమూర్తి పంతులు గారితో కలిసి గురజాడ అప్పారావు గారు వ్యావహారిక భాషోద్యమానికి శ్రీకారం చుట్టారని, ప్రజలు మాట్లాడే భాషలోనే సాహిత్యం ఉండాలని ఆయన చేసిన ఉద్యమం తెలుగు సాహిత్య చరిత్రలో విప్లవాత్మక మార్పులకు దారి తీసిందని బుచ్చి రామ్ ప్రసాద్ తెలిపారు.

తెలుగు భాష, సంస్కృతి, జాతి ఆత్మగౌరవానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు కొత్త ఊపునిచ్చారని ఆయన పేర్కొన్నారు. గురజాడ సాహిత్య రంగంలో చైతన్యం తీసుకొస్తే, ఎన్టీఆర్ గారు రాజకీయ రంగంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి స్వరం ఇచ్చారని అన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, చారిత్రక వారసత్వ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని చైర్మన్ తెలిపారు. అభివృద్ధి, సాంకేతికత, సంప్రదాయాలను సమన్వయం చేస్తూ తెలుగు వారసత్వాన్ని భావితరాలకు అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారతీయ సంస్కృతి, సనాతన విలువలు, తెలుగు భాషా వైభవం పట్ల ప్రత్యేక చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని కొనియాడారు. యువతలో సామాజిక బాధ్యత, దేశభక్తి, సంస్కృతి పరిరక్షణ భావనలను పెంపొందించే దిశగా ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.

అదేవిధంగా మంత్రి  నారా లోకేష్ యువ నాయకత్వం, దూరదృష్టితో సాంకేతికతను వినియోగించి తెలుగు సాహిత్యం, చరిత్ర, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు చేరువ చేసే అవకాశాలు మరింత పెరిగాయని తెలిపారు. యువతలో తెలుగు భాషపై మరింత అవగాహన, అభిమానం పెంపొందించేందుకు ఆధునిక వేదికలను వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ భాషలు, సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వం, చారిత్రక సంపద పరిరక్షణకు జాతీయ స్థాయిలో విశేష ప్రాధాన్యత లభిస్తోందని బుచ్చి రామ్ ప్రసాద్ పేర్కొన్నారు. భారతీయ మూలాలను ప్రపంచానికి చాటిచెప్పే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని అన్నారు.

గురజాడ అప్పారావు కుటుంబ వారసత్వాన్ని గౌరవించడం కూడా సమాజ బాధ్యతేనని పేర్కొంటూ, ఆయన సాహిత్య వారసత్వాన్ని కాపాడుతూ వస్తున్న కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అందిస్తున్న గౌరవం అభినందనీయమని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు, విజయనగరం, నరసరావుపేట తదితర ప్రాంతాల్లో గురజాడ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన కార్పొరేషన్ డైరెక్టర్లు అకెళ్ల వెంకట నారాయణమూర్తి,  భువనేశ్వరి ప్రసాద్ వూచి, చెరుకుపల్లి సంతోష్, చివుకుల దుర్గాప్రసాద్, దర్వాడ ఆనందరావు, జి. బాబూరావు, కృష్ణమోహన్ సబ్నీవీసు, పద్మ కొలచన, రంజిత్ కుమార్ నాయకో, సిందిగేరి కరణం శ్రీనివాసరావు, సురేష్ కుమార్ సారేపక, సూర్య ప్రభా విశ్వనాథం, తేజమూర్తుల ఎన్. నరసింహమూర్తి, వెలగలేటి వెంకట పూర్ణ గంగాధర్, పల్లవజుల వెంకట ఫణికుమార్* తదితరులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అలాగే కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఆజాద్, సీఈఓ  నాగసాయి, అధికారులు, బ్రాంచ్ మేనేజర్లు, సిబ్బంది, సభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

గురజాడకు నిజమైన నివాళి ఆయన చిత్రపటానికి పూలమాల వేయడం మాత్రమే కాదని, ఆయన చూపిన సామాజిక సంస్కరణల మార్గంలో నడవడం, తెలుగు భాషను గౌరవించడం, తెలుగు సాహిత్యాన్ని పరిరక్షించడం, తెలుగు సంస్కృతిని భావితరాలకు అందించడం అని ఆయన స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ ఆత్మగౌరవ స్ఫూర్తి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాసంకల్పం, మంత్రి నారా లోకేష్ యువశక్తి, ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ భారతీయ సంస్కృతి పరిరక్షణ దృక్పథంతో తెలుగు భాషా సాహిత్య వైభవాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *