ప్రభుత్వ కార్యాలయాల వద్ద అల్లర్లను సహించేది లేదు

-స్పోర్ట్స్ కోటా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడుతాం.
-శాప్ కార్యాలయం వద్ద వైసీపీ అల్లర్లు దుర్మార్గం
-దాడులకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగులపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడిన ఘటనను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ కార్యాలయాన్ని ముట్టడించి ఉపాధ్యాయులపై దాడికి యత్నించడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని అన్నారు.

క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, కష్టపడి డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన క్రీడాకారులను అవమానించడం బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారిపై ఫేక్ సర్టిఫికెట్లు అంటూ ఆరోపణలు చేయడం క్రీడాలోకాన్ని అవమానించడమేనన్నారు.

క్రీడాకారులకు 3 శాతం ఉద్యోగ రిజర్వేషన్
క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 3 శాతం స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. క్రీడాకారులకు గౌరవం, గుర్తింపు కల్పించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానమని చెప్పారు.

క్రీడాకారుల సర్టిఫికెట్లు, మెడల్స్‌పై అనుమానాలు ఉంటే నిబంధనల ప్రకారం సంబంధిత సంస్థలు పరిశీలించవచ్చని, కానీ ఉద్యోగాలు సాధించిన క్రీడాకారులను బహిరంగంగా అవమానించడం లేదా వారిపై దాడులకు పాల్పడటం ఎంతమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు.

ప్రభుత్వ నియామకాల్లో రాజకీయ జోక్యం లేదు
మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరిగిందని మంత్రి తెలిపారు. నోటిఫికేషన్ నుంచి ఎంపిక ప్రక్రియ వరకు ప్రభుత్వ సంస్థలు, సంబంధిత అధికారులు తమ విధులను నిర్వర్తించారని చెప్పారు. ఉద్యోగ నియామకాల్లో రాజకీయ జోక్యానికి ప్రభుత్వం తావివ్వలేదని స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హత, ప్రతిభ ఆధారంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. కష్టపడి చదివి, ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అన్నారు.

అల్లర్లు, దాడులను సహించేది లేదు
శాంతియుతంగా తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రజాస్వామ్యంలో అవకాశం ఉందని, అయితే ప్రభుత్వ కార్యాలయాల వద్ద అల్లర్లు సృష్టించడం, ఉద్యోగులపై దాడులకు ప్రయత్నించడం మాత్రం సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.

ఉపాధ్యాయులు, ఉద్యోగులు, క్రీడాకారులపై భౌతిక దాడులకు పాల్పడినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

ఉపాధ్యాయులు, క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు, క్రీడాకారులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. వారి హక్కులు, ఆత్మగౌరవం, ఉద్యోగ భద్రతకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

క్రీడాకారుల సంక్షేమం, క్రీడాభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని, అసోసియేషన్లకు స్వేచ్ఛనిస్తూ నిబంధనల అమలును శాప్ పర్యవేక్షిస్తోందని చెప్పారు.

క్రీడాకారులను రాజకీయాలకు దూరంగా ఉంచాలి
క్రీడాకారులు, ఉపాధ్యాయుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి అన్నారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, వారిపై నిరాధార ఆరోపణలు చేసి మానసికంగా వేధించడం తగదని పేర్కొన్నారు.

క్రీడల ద్వారా దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిన క్రీడాకారులకు గౌరవం ఇవ్వాలని, వారి ప్రతిభను గుర్తించి మరిన్ని అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *