గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన, నిర్దేశిత నిబందనల మేరకు నాణ్యతా ప్రమాణాల పాటిస్తూ పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ అరండల్ పేట, భారత్ పేట, విజయపురి కాలనీ, సీతయ్య డొంక తదితర ప్రాంతాల్లో అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో కొత్తగా రోడ్లు మరియు డ్రైన్లు నిర్మించే సమయాల్లో ప్రతిపాదనలు సమగ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. నీటి నిల్వ లేకుండా డ్రైనేజీ లేవల్స్, త్రాగునీటి సరఫరా పైప్‌లైన్లు, యుజీడి లైన్లను క్షుణ్ణంగా పరిగణనలోకి తీసుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని, పనుల అనంతరం ఆయా వ్యవస్థలకు ఇబ్బంది లేకుండా ఏఈ, డిఈఈలే భాధ్యత వహించాలని స్పష్టం చేశారు. అలాగే, అభివృద్ధి పనులు పూర్తి అయిన వెంటనే సంబంధిత కాంట్రాక్టర్లే అక్కడ మిగిలిపోయిన వ్యర్థాలను తక్షణమే తొలగించాలన్నారు. రోడ్ల మీద పాట్ హోల్స్ అన్నింటినీ వెంటనే పూడ్చివేసి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. నిర్దేశిత టెండర్ అగ్రిమెంట్ నిబంధనల మేరకు, నాణ్యతా ప్రమాణాలతో పూర్తిగా చేసిన పనులకు మాత్రమే బిల్లుల చెల్లింపు ప్రతిపాదనలు తయారు చేసి పంపాలనిఎస్ఈ ని ఆదేశించారు. పారిశుధ్య పనులపై ప్రజారోగ్య అధికారులతో మాట్లాడుతూ, చెత్త సేకరణ కోసం కేటాయించిన ఈ-ఆటోలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకల్లా పక్కాగా ఫీల్డ్ లోకి వెళ్లాలని స్పష్టం చేశారు. ఈ-ఆటోల రాకపోకలు మరియు నిర్వహణకు సంబంధించిన రోజువారీ ట్రిప్ ల నివేదికను క్రమం తప్పకుండా కమిషనర్ ఛాంబర్‌కు అందజేయాలని ఆదేశించారు. నగర అందాన్ని దెబ్బతీసేలా ఉన్న వాల్ పోస్టర్లను తక్షణమే తొలగించాలని, అంటించే వారిపై భారీ అపరాధ రుసుం విధించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లకు స్పష్టం చేశామని, నిర్లక్ష్యంగా ఉంటే ఇక నుండి ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పర్యటనలో డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, ఈఈ విష్ణు వర్ధన్, వేణు, డిఈఈలు వెంకటరమణ, శ్రీనివవాస్, చైతన్య, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News