-9154970454 నంబరుతో ఏర్పాటు
-ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-అధికారుల క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా జిల్లాలోనూ వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
ఈ మేరకు మంగళవారం కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, చెరువులు, వాగులు, కాలువల పరిసరాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి 24 గంటలూ పనిచేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేంద్రంలో రెవెన్యూ, వ్యవసాయం, విద్యుత్తు, వైద్య ఆరోగ్యం, పౌర సరఫరాలు తదితర శాఖల సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. వర్షాలు, వరదలు, నీట ముంపు లేదా ఇతర అత్యవసర పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు 91549 70454 కంట్రోల్ రూమ్‌కు తెలియజేయవచ్చన్నారు. సహాయం కోసం సంప్రదించాలన్నారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్తు, ఆర్ అండ్ బీ తదితర శాఖల అధికారులు పటిష్ట సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News