పారిశ్రామిక ప్ర‌తిభ‌కు ప్రాంతీయ ప‌ట్టం

– అక్టోబ‌ర్ 16న విజ‌య‌వాడ‌లో అమ‌రావ‌తి ప్రాంతీయ స‌ద‌స్సు
– ప్ర‌ధాన స‌ద‌స్సుకు ముందుగా పెట్టుబ‌డుల‌కు అనువైన వాతావ‌ర‌ణం
– ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌కు అద్భుత అవ‌కాశం
– అన్ని విధాల స‌హాయస‌హ‌కారాలు అందించేందుకు సిద్ధం
– ఎంవోయూల‌తో ఎంఎస్ఎంఈల‌కు పెద్దఎత్తున అంద‌నున్న ప్రోత్సాహం
– 8 జిల్లాల క‌లెక్ట‌ర్ల స‌న్న‌ద్ధ‌త స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విక‌సిత్ భార‌త్‌, స్వర్ణాంధ్ర @ 2047 ఆర్థిక ల‌క్ష్యాల‌కు అనుగుణంగా విశాఖ‌ప‌ట్నంలో న‌వంబ‌ర్ 12, 13 తేదీల్లో 31వ సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో దీనికి ముందు విశాఖ‌ప‌ట్నం, కాకినాడ‌, అమ‌రావ‌తి అనంత‌పురం, తిరుప‌తి ప్రాంతీయ స‌ద‌స్సులు జ‌ర‌గ‌నున్నాయ‌ని ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. అక్టోబ‌ర్ 16న విజ‌య‌వాడ‌లో అమ‌రావ‌తి ప్రాంతీయ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంద‌ని.. ఈ సద‌స్సు విజ‌యానికి ఎనిమిది జిల్లాల క‌లెక్ట‌ర్లు, అధికారుల స‌మష్టి కృషి, స‌మ‌న్వ‌యంతో కృషిచేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.
మంగ‌ళ‌వారం అమ‌రావ‌తి ప్రాంతీయ స‌ద‌స్సు స‌న్న‌ద్ధ‌త స‌మావేశం వ‌ర్చువ‌ల్‌గా జ‌ర‌గ్గా.. ఈ వీసీకి జిల్లా క‌లెక్ట‌ర్, అమ‌రావ‌తి ప్రాంతీయ స‌దస్సు మెంబ‌ర్ క‌న్వీన‌ర్ డా. జి.ల‌క్ష్మీశ క‌లెక్ట‌రేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్ నుంచి హాజ‌ర‌య్యారు. అదేవిధంగా గుంటూరు క‌లెక్ట‌ర్ సి.ఎం.సాయికాంత్ వ‌ర్మ‌, ప‌ల్నాడు క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, మార్కాపురం క‌లెక్ట‌ర్ ఎం.విజ‌య సునీత‌, ప్ర‌కాశం క‌లెక్ట‌ర్ పి.రాజాబాబు, ఏలూరు క‌లెక్ట‌ర్ కె.వెట్రిసెల్వి, బాప‌ట్ల క‌లెక్ట‌ర్ డా. వి.వినోద్ కుమార్, కృష్ణా క‌లెక్ట‌ర్ డి.కె.బాలాజీ పాల్గొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా అమ‌రావ‌తి ప్రాంతీయ స‌ద‌స్సుకు ఆయా జిల్లాల నుంచి చేస్తున్న ఏర్పాట్ల‌ను వివ‌రించారు. జిల్లాల ప్రత్యేకతలు, విశిష్ట వ‌న‌రులు, అవ‌కాశాలకు అనుగుణంగా పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, ఎంఎస్‌ఎంఈల భాగస్వామ్యం, స్థానిక పరిశ్రమల ప్రోత్సాహం, విద్యా–పరిశ్రమల అనుసంధానంపై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ విజ‌య‌వాడ‌లో అమ‌రావ‌తి ప్రాంతీయ స‌ద‌స్సును పెద్దఎత్తున నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు.
ప్రాంతీయ స‌ద‌స్సుల‌తో వ్యూహాత్మ‌క ప్ర‌యోజ‌నాలు:
విశాఖలో జ‌రిగే భాగ‌స్వామ్య స‌ద‌స్సుకు ముందుగా ప్రాంతీయ సదస్సులను నిర్వహించడం ద్వారా పలు వ్యూహాత్మక ప్రయోజనాలను సాధించ‌వ‌చ్చ‌ని.. ప్రాంతాల వారీగా ఉన్న ప్రత్యేక పారిశ్రామిక సామర్థ్యాలను వెలికితీయడం, సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడం, అనుబంధ పరిశ్రమలు–రంగాల అభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు పెట్టుబడులను వివిధ ప్రాంతాలకు విస్త‌రించ‌వ‌చ్చ‌ని క‌లెక్ట‌ర్ లక్ష్మీశ అన్నారు. ఎంఎస్‌ఎంఈలు, స్థానిక పరిశ్రమలను పెట్టుబడిదారులతో అనుసంధానం చేయడం, స్థానిక భాగస్వామ్య వర్గాల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, విద్యాసంస్థలతో పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడం వంటి లక్ష్యాలను ప్రాంతీయ సదస్సుల ద్వారా సాధించ‌వ‌చ్చ‌న్నారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌ర‌మైన భూములతో పాటు పారిశ్రామిక విధానాల ద్వారా అవ‌స‌ర‌మైన చేయూత అందించ‌నున్న‌ట్లు తెలిపారు. ఆధునిక సాంకేతిక‌త‌లు, ఇండ‌స్ట్రీ 4.0, డీప్ టెక్‌, స్టార్ట‌ప్ ఎంట‌ర్‌ప్రైజెస్ వంటివాటిని కూడా పెద్దఎత్తున ప్రోత్స‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్రధాన సదస్సుకు ముందుగానే పెట్టుబడులు, పరిశ్రమలు, భాగస్వామ్యాలపై అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు వేదిక అయిన అమ‌రావ‌తి ప్రాంతీయ స‌ద‌స్సులో ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌లు పెద్దఎత్తున భాగ‌స్వాములై, అత్య‌ధిక ఎంవోయూలకు కేరాఫ్‌గా నిలిచేలా విజ‌య‌వంతం చేయాల‌న్నారు. వివ‌రాల‌కు 91549 70454 (క‌లెక్ట‌రేట్ క‌మాండ్ కంట్రోల్ కేంద్రం/ఇన్వెస్ట‌ర్స్ డెస్క్‌) నంబ‌రులో సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. స‌మావేశంలో ఎన్‌టీఆర్ జిల్లా ప‌రిశ్ర‌మ‌ల అధికారి ఎం.మ‌ధు, ఎనిమిది జిల్లాల ప‌రిశ్ర‌మ‌లు, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *