అమరావతి క్వాంటం వ్యాలీలో సమగ్ర జన్యు విశ్లేషణ కేంద్రం

-మంత్రి సత్య కుమార్ వెల్లడి
-గుంటూరు జీజీహెచ్‌లో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
-క్యాన్సర్‌ కేసుల గుర్తింపు, చికిత్సకు విస్తృత ఏర్పాట్లు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీలో అరుదైన వ్యాధులకు సంబంధించిన జన్యుపరమైన కారణాలను గుర్తించేందుకు అతిపెద్ద స్థాయిలో సమగ్ర జన్యు విశ్లేషణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లోని నాట్కో క్యాన్సర్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కేంద్రాన్ని పైలట్‌ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో క్వాంటం వ్యాలీలో ఏర్పాటు చేసే కేంద్రం ద్వారా అధునాతన జన్యు పరీక్షలు, పరిశోధనలను మరింత విస్తరిస్తామని మంత్రి సత్య కుమార్ తన ప్రసంగంలో చెప్పారు. క్యాన్సర్‌తో పాటు అరుదైన వ్యాధులకు సంబంధించిన జన్యు సమాచారాన్ని సమగ్రంగా సేకరించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

ముందస్తు గుర్తింపుపై ప్రత్యేక దృష్టి

క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లకు ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 4.27 కోట్ల మంది లక్ష్య జనాభాలో ఇప్పటివరకు సుమారు 2.65 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించామని, దాదాపు 7,500 కొత్త క్యాన్సర్‌ కేసులను గుర్తించామని వెల్లడించారు. అనుమానితులను తదుపరి నిర్ధారణ పరీక్షలకు పంపించి, వ్యాధి నిర్ధారణ అయిన వారికి సకాలంలో చికిత్స అందేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో గత ప్రతి ఏడాది 70000 ku పైగా కొత్త cancer కేసులు నమోదవుతున్నాయని, 40 వేల మంది వరకు మరణిస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో నమోదయ్యే మొత్తం మరణాల్లో క్యాన్సర్‌ వాటా 9.6 శాతంగా ఉందన్నారు. 2020 నుంచి 2025 మధ్య కొత్త క్యాన్సర్‌ కేసులు 39.5 శాతం పెరిగాయని వివరించారు. ప్రజలు జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

రూ.311 కోట్లతో నాలుగు కేంద్రాలు

గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, కడపలో నాలుగు సమగ్ర క్యాన్సర్‌ కేంద్రాలను తొలి దశలో రూ.311 కోట్లతో అభివృద్ధి చేశామని మంత్రి తెలిపారు. వీటికి 596 వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు మంజూరు చేసి భర్తీ చేశామని చెప్పారు. గుంటూరు, విశాఖపట్నం, కర్నూలులో అధునాతన రేడియేషన్‌ పరికరాలు, బ్రాకీథెరపీ, సీటీ సిమ్యులేటర్‌ వంటి సదుపాయాలు కల్పించామని వివరించారు.

కాకినాడ, అనంతపురంలో రెండో దశలో క్యాన్సర్‌ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మూడో దశలో మరో 11 వైద్య కళాశాల ఆసుపత్రులను క్యాన్సర్‌ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

గుంటూరు కేంద్రంలో అధునాతన సేవలు

గుంటూరు నాట్కో క్యాన్సర్‌ కేంద్రాన్ని రూ.41 కోట్లతో అభివృద్ధి చేశామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. లీనియర్‌ యాక్సిలరేటర్‌, బ్రాకీథెరపీ, సీటీ సిమ్యులేటర్‌, శస్త్రచికిత్స పరికరాలను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ప్రభుత్వ వైద్య సంస్థల్లో తొలిసారిగా రూ.18 కోట్లతో పెట్‌ స్కాన్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.

జన్యు పరీక్షలతో చికిత్సలో మార్పు

గుంటూరు కేంద్రంలో ఏర్పాటు చేసిన జన్యు పరీక్షల విభాగం ద్వారా రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రోగులకు జన్యు, జీవసూచిక పరీక్షలను ఉచితంగా అందిస్తామని మంత్రి తెలిపారు. ప్రైవేటు ప్రయోగశాలల్లో రూ.25 వేల వరకు ఖర్చయ్యే పరీక్షలను ఇక్కడ ఉచితంగా చేయనున్నామని చెప్పారు.

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ద్వారా క్యాన్సర్‌ కణాల్లోని జన్యు మార్పులను గుర్తించి, రోగికి సరిపోయే మందు, చికిత్స విధానాన్ని ఎంచుకునేందుకు వైద్యులకు మరింత సమాచారం లభిస్తుందని వివరించారు. భవిష్యత్తులో కుటుంబాల్లో జన్యుపరమైన వ్యాధుల ముప్పును కూడా ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందన్నారు.

ఎన్‌టీఆర్‌ వైద్యసేవ ద్వారా రూ.25 లక్షల వరకు

ఎన్‌టీఆర్‌ వైద్యసేవ పరిధిలోని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఒక్కో క్యాన్సర్‌ రోగికి రూ.25 లక్షల వరకు వైద్యసేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. క్యాన్సర్‌ వైద్య సేవలకు గత రెండేళ్లలోనే సుమారు రూ.1,500 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. 2019 నుంచి 2024 వరకు సుమారు రూ.2,200 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.

క్యాన్సర్‌ చికిత్స కోసం పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి అన్నారు. ముందస్తు పరీక్ష నుంచి నిర్ధారణ, శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్‌ వరకు అవసరమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు.
క్యాన్సర్‌ రోగులు ప్రతి చికిత్స కోసం దూర ప్రాంతాల్లోని పెద్ద ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా 23 జిల్లాల్లో పగటి కీమోథెరపీ కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. దీనివల్ల రోగులకు ప్రయాణ భారం తగ్గడంతో పాటు తమ ప్రాంతానికి దగ్గర్లోనే చికిత్స పొందే అవకాశం ఏర్పడిందన్నారు.

క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. వైద్య, నర్సింగ్‌ విద్యార్థులు కొత్త సాంకేతికత, పరిశోధనలపై దృష్టి పెట్టాలని, భవిష్యత్తులో అధునాతన వైద్య పరికరాలను దేశంలోనే అభివృద్ధి చేసే దిశగా కృషి చేయాలని సూచించారు.

ప్రొఫెసర్‌ రమేష్‌బాబుకు సన్మానం

క్యాన్సర్‌ వైద్య సేవల విస్తరణకు కృషి చేస్తున్న వైద్య విద్యాశాఖ ప్రధాన కార్యాలయంలోని క్యాన్సర్‌ వైద్య సేవల పర్యవేక్షకుడు ప్రొఫెసర్‌ రమేష్‌బాబును మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, అధికారులు సన్మానించారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఈ సన్మానం చేసినట్లు వైద్య విద్యాశాఖ సంచాలకులు విష్ణువర్ధన్‌ తెలిపారు. క్యాన్సర్‌ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి వీరపాండ్యన్‌ తన ప్రసంగం ద్వారా చెప్పారు. కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ చక్రధర్‌బాబు, జన్యు విశ్లేషణ కేంద్రం భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *