దివ్యాంగులకు చేయూత.. పేదలకు భరోసా

-31 మంది దివ్యాంగుల‌కు ఉచిత ట్రై స్కూటీలు
-119 మంది ల‌బ్ధిదారుల‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కులు
-ఇంధ‌న‌శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త :
దివ్యాంగుల జీవితాల్లో స్వావలంబనకు బాటలు వేయడంతో పాటు ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడమే ప్ర‌భుత్వ‌ లక్ష్యమ‌ని ఇంధన‌శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి గొట్టిపాటి మంగ‌ళ‌వారం ప‌ర్య‌టించారు. ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. కొరిశ‌పాడు మండ‌లం, మేద‌ర‌మెట్లలో దివ్యాంగుల‌కు ఉచిత ట్రై స్కూటీల‌ను, ల‌బ్ధిదారుల‌కు సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ చెక్కుల‌ను అంద‌జేశారు. అనంత‌రం సీఎం చంద్రబాబు ఆదేశాలతో pgrs గ్రీవెన్స్ కార్య‌క్ర‌మాన్ని ప్రతి మండలంలో నిర్వ‌హిస్తున్నామన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.., ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం ద్వారా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామన్నారు. పీ4 కార్యక్రమం, దాత‌లు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో 31 మంది దివ్యాంగులకు ఉచితంగా ఈ రోజు ట్రై స్కూటీలు పంపిణీ చేశామ‌న్నారు. ఇప్పటివరకు అర్హులైన 202 మంది దివ్యాంగులకు ట్రై స్కూటీలు అందించినట్లు మంత్రి ఈ సంద‌ర్భంగా తెలిపారు. స‌మాజ సేవ‌లో భాగంగా సీఎస్ఆర్ నిధుల‌తో పేద‌ల‌కు చేయూత ఇచ్చే స్వ‌చ్ఛంద సంస్థ‌లు, దాత‌ల‌ను మంత్రి అభినందించారు.

దివ్యాంగులు వాహనాలను తమ అవసరాలకు, స్వయం ఉపాధికి వినియోగించుకుని స్వావలంబన దిశగా ముందుకు సాగాలని మంత్రి గొట్టిపాటి సూచించారు. త‌మ వాహ‌నాల‌ను వేరే వారికి ఇవ్వొద్ద‌ని ఆయ‌న‌ హిత‌వు ప‌లికారు. దాతలు అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో 119 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, ఎల్‌ఓసీ చెక్కులను ఆయ‌న‌ అందజేశారు. అద్దంకి నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు రూ.32 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులతో 3,821 మంది పేదలు లబ్ధి పొందారని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిలో లేని రోగాల‌తో పాటు ఆరోగ్యశ్రీ వర్తించని ఆస్పత్రుల్లో కూడా ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని ప్ర‌భుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంద‌ని మంత్రి వివ‌రించారు. విద్య, వైద్యం వంటి మౌలిక రంగాలను సామాన్యులకు మరింత చేరువ చేయడమే రాష్ట్ర‌ ప్రభుత్వ లక్ష్యమని ఆయ‌న‌ పేర్కొన్నారు.

ఉద్యోగుల‌ను అవ‌మానించేలా… నిరుద్యోగుల‌ను రెచ్చ‌గొట్టేలా…

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఉపాధ్యాయులపై దాడి వంటి అంశాలపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హార శైలిని మంత్రి గొట్టిపాటి తీవ్రంగా ఖండించారు. క‌ష్ట‌ప‌డి ప్ర‌భుత్వ ఉద్యోగాలు పొందిన వారిని అవ‌మానించేలా., ఉద్యోగాలు రాని నిరుద్యోగుల‌ను రెచ్చ‌గొట్టేలా వైసీపీ నేత‌ల తీరు ఉంద‌ని దుయ్య‌బ‌ట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను బార్‌షాపుల వద్ద విధులకు వినియోగించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. దైవ‌స‌మానులైన గురువుల‌పై దాడి చేయ‌డం బాధాక‌ర‌మైన విష‌య‌మ‌న్నారు. బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. 11 సీట్ల‌తో ప్ర‌తి ప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోయినా వైసీపీ తీరులో మాత్రం మార్పు రాలేద‌ని ఎద్దేవా చేశారు. ప్రజా తీర్పును గౌరవించి… ప్రతిపక్ష హోదా లేక‌పోయినా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి హిత‌వు ప‌లికారు. విద్యా, ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల‌ను సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేసేందుకు కూట‌మి ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌న్నారు. అద్దంకి నియోజకవర్గంలోని విద్యార్థులకు ఇప్పటివరకు 11,800కు పైగా సైకిళ్లు పంపిణీ చేసినట్లు మంత్రి గొట్టిపాటి ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

విద్యా శాఖ మంత్రి లోకేష్ సంస్క‌ర‌ణాత్మ‌క విధానాల‌తో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయ‌న‌ సూచించారు. అద్దంకి నియోజకవర్గ అభివృద్ధికి అధిక‌ ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి చెప్పారు. అద్దంకి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి సుమారు రూ.100 కోట్లు వ్యయం చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఒక్క రూపాయి కూడా ర‌హ‌దారుల కోసం ఖ‌ర్చు చేయ‌లేద‌న్నారు. గుంత‌ల రోడ్ల‌తో విద్యార్థులు, ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డ్డార‌ని తెలిపారు. ప్రజల వద్దకే సమస్యల పరిష్కారం కోసం నిర్వ‌హించిన‌ ‘మీ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయ‌న‌ ఆదేశించారు. ప్రజల అవసరాలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే తన ప్రాధాన్యమని మంత్రి ఈ సంద‌ర్భంగా స్పష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ రాజాబాబుతో పాటు ప‌లువురు అధికారులు, కూట‌మి నేత‌లు, స్థానిక నాయ‌కులు, ల‌బ్ధిదారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *