Breaking News

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన నగర కమిషనర్‌ కె. మయూర్‌ అశోక్‌

-76 వార్డులకు 26 మంది రిటర్నింగ్‌ అధికారులు.. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో ఎన్నికల ఏర్పాట్లు మరియు నామినేషన్ల ప్రక్రియ అత్యంత పకడ్బందీగా కొనసాగుతున్నాయని నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె.మయూర్ అశోక్ తెలిపారు. శుక్రవారం నగరంలోని యాదవ బజార్ శ్రీకృష్ణ కళ్యాణ మండపం, ఐపిడి కాలనీలోని వార్డ్ సచివాలయాల్లో, నల్లచెరువు ఏఈ కార్యాలయం, కుందుల రోడ్ లోని వార్డ్ సచివాలయంలో, బృందావన్ గార్డెన్స్ లోని జిఎంసి సర్కిల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలను పరిశీలించి, సిబ్బంది హాజరు, అవసరమైన పత్రాలు ఉన్నదీ లేనిదీ, మౌలిక వసతులపై తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ నెల 14వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, షెడ్యూల్ ప్రకారం గుంటూరు నగరంలోని 76 వార్డులకు సంబంధించి ఈ నెల 16వ తేదీన అన్ని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల్లో అధికారికంగా ఎన్నికల నోటీసు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 26 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించడమైందన్నారు. రిటర్నింగ్ అధికారులు శుక్రవారం తమ కార్యాలయాల్లో ఎన్నికల నోటీసులు అందుకొని, నోటీసు ప్రకారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించబడతాయని తెలిపారు. గుంటూరు నగరంలో ఉన్న అన్ని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల వద్ద నామినేషన్ల స్వీకరణకు అవసరమైన స్టాట్యూటరీ, నాన్-స్టాట్యూటరీ మెటీరియల్స్ మరియు ఇతర మౌలిక వసతుల ఏర్పాట్లన్నీ పూర్తిగా సిద్ధం చేయబడ్డాయని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా, నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్ మరియు కౌంటింగ్ వరకు అన్ని దశలు సజావుగా సాగేలా ప్రతి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం దగ్గర తగిన పోలీసు బలగాలను మోహరించడమే కాకుండా, పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమన్వయ సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ విధంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరగనున్న ఈ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లతో పూర్తి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలాగే ఇప్పటికే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మేరకు రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయడం, పోస్టర్స్, బ్యానర్స్ తొలగింపు చేస్తున్నామన్నారు. నగరంలో పోటీ చేసే అభ్యర్ధులు కూడా నిర్దేశిత ఎన్నికల నిబందనలు పాటిస్తూ ప్రశాంత ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హజ్–2027 యాత్రికుల ఎంబార్కేషన్ పాయింట్ల మార్పు కోసం వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: హజ్–2027 యాత్రకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది యాత్రికులు తమ ప్రయాణ …