సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త:
పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో, శ్రీ విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు శ్రీ ధాన్యలక్ష్మీ అమ్మవారికి విశేష అభిషేక మహోత్సవం, కుంకుమార్చనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు శ్రీ ధాన్యలక్ష్మీ అమ్మవారికి శ్రీయాగాన్ని వైభవంగా నిర్వహించారు.
సాయంత్రం 5:30 గంటలకు శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించారు. అనంతరం శ్రీ ధాన్యలక్ష్మీ అమ్మవారికి పల్లకిసేవ, అర్చన, నివేదన, మంగళాశాసనం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల సమక్షంలో వైభవంగా జరిగాయి. అనంతరం తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ ధాన్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. భక్తి శ్రద్ధలతో ఈ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహంతో ధాన్యసమృద్ధి, పంటల అభివృద్ధి, ఆహార కొరతలు లేకుండా అంతా సుభిక్షంగా ఉండాలి అని భక్తులు శ్రీ ధాన్యలక్ష్మీ అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు .
Prajavartha Online Telugu News