-24వ డివిజన్ లో రూ. 19.80 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 24వ డివిజన్ సీతారాంపురంలోని గద్దె బాబూరావు వీధిలో రూ. 19.80 లక్షల విలువైన రోడ్లు మరియు డ్రెయిన్ల నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి మంగళవారం ఆయన శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నియోజకవర్గంలో రహదారుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నాడు – నేడు ద్వారా చేసిన ప్రగతిని ఎప్పటికప్పుడు ప్రజలకు చూపుతున్నామన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఒకే ప్రాంతంపై దృష్టి కేంద్రీకరించి, మిగతా ప్రాంతాలను పూర్తి నిర్లక్ష్యానికి గురిచేసిందని విమర్శించారు. నియోజకవర్గంలో గద్దె బాబూరావు వీధి ఉందని కూడా గత పాలకులకు తెలియదని ఎద్దేవా చేశారు. కానీ ఈ ప్రభుత్వం నగర ప్రజల సౌకర్యం కోసం రూ. వందల కోట్ల నిధులను ఖర్చు చేస్తోందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో మురుగునీటి పారుదల వ్యవస్థ, సౌకర్యవంతమైన రహదారులు, పుష్కలమైన తాగునీరు, మెరుగైన విద్యుత్ వ్యవస్థ వంటి మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో జరుగుతున్న ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన పనులను నగర ప్రజలు గమనించాలని కోరారు. అలాగే అభివృద్ధి పనులలో స్థానికులు సైతం భాగస్వాములై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. తద్వారా పనులు మరింత నాణ్యతతో పూర్తి చేసే అవకాశాలుంటాయన్నారు. పనులను 2 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈ(ఇంజనీరింగ్) వెంకటేష్, నాయకులు కుక్కల రమేష్, భాస్కర్ రావు, శంకర్, మానం వెంగయ్య, మానం గంగాధర్ రావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News