-కుందావారి కండ్రికలో పండుగ వాతావరణంలో ఏరువాక పూర్ణిమ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులంతా అధిక దిగుబడులు సాధించడమే లక్ష్యంగా అన్నదాతల్లో స్ఫూర్తి నింపేందుకే ఏరువాక పూర్ణిమ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించినట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. కుందావారి కండ్రిక గ్రామంలో ఏరువాక పూర్ణిమ కార్యక్రమాన్ని మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వయంగా ట్రాక్టర్ తో పొలాన్ని దున్ని, విత్తనాలు చల్లారు. వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రైతు భరోసా కేంద్రాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. అన్నదాతల విషయంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్న కలలను.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా ఆర్థిక భారం పడనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయడం జరుగుతోందన్నారు. 2021 ఖరీఫ్ పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతన్నలకు చెప్పిన మాట ప్రకారం రూ. 2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయడం హర్షణీయమన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం రైతులను నిండా దగా చేసిందని.. రుణమాఫీ సహా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచించిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల ముంగిటకే వ్యవసాయ పథకాలను తీసుకువచ్చిందని వెల్లడించారు. అంతేకాకుండా గత తెలుగుదేశం హయాంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు బకాయిలు పెట్టిన రూ.990 కోట్లను.. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టగానే చెల్లించడం జరిగిందన్నారు. వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా పథకం, రాయితీ విత్తనాలు, పురుగుమందులు, యాంత్రీకీకరణ పరికరాలు వంటి సంక్షేమ పథకాలతో జగనన్న ప్రభుత్వం రైతులను ఆదుకుంటోందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ముందు జాగ్రత్త చర్యలతో సాగునీటి ప్రాజెక్టులన్ని జలకళను సంతరించుకున్నట్లు వెల్లడించారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా రైతులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగనన్న ప్రభుత్వానికి రైతన్నలు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఏఈఓ సురేష్, కండ్రిక సొసైటీ ఛైర్మన్ రవీందర్ రెడ్డి, పాలకేంద్రం ప్రెసిడెంట్ మంగారెడ్డి, నాయకులు యరగొర్ల శ్రీరాములు, మేడా రమేష్, షేక్ ఇస్మాయిల్, మహేష్, సంజీవ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రైతులు సాదం శ్రీను, దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొల్లి నాగిరెడ్డి, పామర్తి వెంకయ్య, చిన్ని, రామిరెడ్డి, వెంకటరెడ్డి, భీమిరెడ్డి శివరామిరెడ్డి, గోపిరాజు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News