-వరల్డ్ బ్లడ్ డోనార్ డే వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా కంటి శిబిరం ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రక్తం లభించక రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాణం పోకూడదని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. వరల్డ్ బ్లడ్ డోనార్ డే సందర్భంగా అజిత్ సింగ్ నగర్లోని ఎం.కె.బేగ్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంటి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రక్తదానం చేసేందుకు ప్రజల్ని చైతన్యపరచడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి 65 సంవత్సరాల వరకూ రక్తాన్ని దానం చేయవచ్చని మల్లాది విష్ణు పేర్కొన్నారు. 3 నెలలకు ఒకసారి అంటే సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చని వివరించారు. రక్తదానం చేయడం వల్ల దానం చేసినవారికి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలుంటాయని.. గుండెపోటు రాదని, బీపీ నియంత్రణలో వుంటుందన్నారు. కనుక ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా రక్తదాన కార్యక్రమాలు విరివిగా ఏర్పాటు చేయడం ద్వారా.. రక్తదాన విశిష్టతను ప్రజలకు వివరించాలని, వారిలో చైతన్యం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యువజన, సర్వీసుల శాఖ సీఈవో శ్రీనివాసరావు, నాయకులు హఫీజుల్లా, నందెపు సురేష్, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, అఫ్రోజ్, కోలా శాంతకుమారి, ఎన్జీవో రాంబాబు, శివకుమార్, నాయక్, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News