-వారాంతానికి యాక్షన్ టేకెన్ రిపోర్టు సమర్పించాలి
-పౌర సరఫరాల మరియు విద్యుత్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఏపీసీపీడీసీఎల్ మరియు పౌర సరఫరాల శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారంపై సుధీర్ఘంగా చర్చించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు వచ్చిన సమస్యలపై శనివారానికి యాక్షన్ టేకెన్ రిపోర్ట్(ATR) సమర్పించాలని ఆదేశించారు. నియోజకవర్గంలో ఎక్కడా పవర్ ఓవర్ లోడ్ సమస్య తలెత్తకూడదని సూచించారు. అలాగే అద్దెకు నివసిస్తున్న వారి పేర్ల మీద ఉన్న విద్యుత్ మీటర్లను వీలైనంత త్వరగా డీలింక్ చేసి.. పెన్షన్ దారులకు ఇబ్బందులు గురి కాకుండా చూడాలన్నారు. ఇళ్లల్లోకి, మురుగు కాల్వలలో ఉన్న విద్యుత్ స్తంభాలను తక్షణమే తొలగించాలని పేర్కొన్నారు. అనంతరం సబ్ స్టేషన్ల నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. ఉడాకాలనీ, శ్రీనగర్ కాలనీ, జీవీఆర్ కాలనీ, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణంలోని సబ్ స్టేషన్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. అదే విధంగా కార్మిల్ నగర్ లో కొత్త సబ్ స్టేషన్ నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రేషన్ పంపిణీలో నియోజకవర్గ ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు. ముఖ్యంగా రేషన్ వెహికల్ ప్రతి ఇంటికీ వెళ్లాలని.. వాహనం ఎప్పుడు వస్తుందనే సమాచారం కూడా ముందుగానే అందించాలన్నారు. వేలిముద్రలు, ఐరీస్ పడని వారి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహించి.. సరుకులను పంపిణీ చేసే విధంగా చూడాలన్నారు. కార్డులను విడగొట్టే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. సమీక్షలో ఏపీసీపీడీసీఎల్ విజయవాడ టౌన్ ఈఈ బి.వి.సుధాకర్, డీఈలు రవిచంద్ర, శ్రీధర్, నాగసాయి, బాలాజీ, ఏఎస్ఓలు లక్ష్మీనారాయణ రెడ్డి, ధనుంజయరెడ్డి, సంబంధిత ఏఈలు, ఆర్ఐలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News