మహిళల ఆర్థిక చైతన్యమే జగనన్న లక్ష్యం

-రాజమండ్రిలో గత ఎన్నికలలో చేసిన తప్పు మరోసారి చేయకండి
-వైఎస్సార్ చేయూత వారోత్సవ సభలో ఎంపీ భరత్

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త:
మహిళల ఆర్థిక చైతన్యంతోనే కుటుంబాలు తద్వారా రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ విశ్వాసమని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. నగరంలోని తాడితోట కమ్యూనిటీ హాల్ లో వైఎస్సార్ చేయూత ఫేస్-3 వారోత్సవాలలో భాగంగా స్థానిక 9, 10, 11, 12, 13, 14, 15, 16 వార్డులలోని లబ్థిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. మహిళల ఆర్థిక పురోభివృద్ధికి, వారి స్వశక్తిపై వారు నిలబడే విధంగా సీఎం జగనన్న ఆర్థిక సహాయం చేస్తుంటే దీనికి కూడా ప్రతిపక్షాలు వక్రభాష్యం చెబుతున్నాయని, రకరకాలుగా విమర్శలు చేస్తున్నాయన్నారు. ఎవరెన్ని విమర్శలు చేస్తున్నా జగనన్న ఏ మాత్రం వెనుకడుగు వేయరని, మరింత సమర్థవంతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్నారు. గత టీడీపీ హయాంలో చంద్రబాబుకు మాదిరిగా ఎన్నికల సమయంలో డబ్బులిచ్చి ఓట్లు వేయించుకోవడం, మళ్ళా అధికారంలోకి వచ్చాక ప్రజల బాగోగులు విస్మరించడం జగనన్నకు చేతకాదన్నారు. జగనన్న సీఎం గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఈ మూడున్నరేళ్ళలో చేపట్టినన్ని సంక్షేమ పథకాలు ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత సాహసోపేత నిర్ణయాలు, చర్యలు తీసుకోలేదని చెప్పారు. సమ సమాజ స్థాపన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచన అని, అదే ఇప్పుడు జగనన్న చేసి చూపిస్తున్నారని చెప్పారు. పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాలలో రాణించాలనేది సీఎం జగన్ లక్ష్యమన్నారు. ఆ దిశగానే మహిళలకు ప్రతీ విషయంలో 50శాతం కేటాయిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ చేయూత ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహాయాన్ని దుర్వినియోగం చేయకుండా కుటీర పరిశ్రమగానో, చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనతో మీరు నిలబడి మరో నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఎంపీ భరత్ పిలుపునిచ్చారు. గతంలో మద్యం దుకాణాలు, మళ్ళీ వాటికి బెల్ట్ షాపులతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని, అందుకే ప్రభుత్వం ఈ మద్యం వ్యాపార విషయంలో కఠినంగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అందువల్లనే బెల్ట్ షాపులు ఇప్పుడు ఎక్కడా లేవన్నారు. జగనన్న తీసుకున్న నిర్ణయానికి అనేక కుటుంబాలలో వెలుగులు కనిపిస్తున్నాయన్నారు. పురుషులైతే డబ్బును దుబారా చేస్తారనే ఉద్దేశంతో నేరుగా మహిళల బ్యాంకు అకౌంట్లలోనే సంక్షేమ పథకాల లబ్ధి పడేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇవన్నీ సక్రమంగా ఇలానే కొనసాగాలంటే జగనన్నను ఆశీర్వదించాలని, మధ్యలో మళ్ళీ చంద్రబాబు వస్తే ఈ సంక్షేమ పథకాలేవీ అమలుకావని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మంచి నిర్ణయం తీసుకుని జగనన్నకు ఓటు వేశారని, కానీ మన రాజమండ్రిలో మాత్రం పెద్ద పొరపాటు చేశారన్నారు. ఈసారి మాత్రం అటువంటి పొరపాటు చేయవద్దని, వైసీపీ అభ్యర్థులనే గెలిపించమని ఎంపీ భరత్ కోరారు. అనేక మంది ప్రాణాలు రోడ్డు ప్రమాదాలలో కోల్పోతున్న వాటి నివారణకు గత టీడీపీ పాలకులు దృష్టి సారించలేకపోయారని అన్నారు. తాము మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జికి కేంద్ర మంత్రిచే శంకుస్థాపన చేయిస్తే..దానిని మా హయాంలోనే తెచ్చామని టీడీపీ లేనిపోని ప్రగల్భాలు పలుకుతోందన్నారు. ప్రాజెక్ట్ మంజూరు అయి వెనుకకు పోతే ఈ నాయకులు ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు. మోరంపూడి జంక్షన్ వద్ద అనేక ఘోర ప్రమాదాలు జరిగాయని, దానికి మూల్యం టీడీపీ నేతలు చెల్లిస్తారా అని ప్రశ్నించారు. వచ్చే సంవత్సరం ఈ సమయానికి మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఈ సమావేశంలో రుడా ఛైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, నగర మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, ఖాదీ బోర్డు వైస్ చైర్మన్ పిల్లి నిర్మల, మాజీ కార్పొరేటర్ సుధారాణి, పెంకే సురేష్,దాసి వెంకటరావు, నరవ గోపాలకృష్ణ, అరే చిన్ని, కర్రి సతీష్, పెద్దిరాజు, మేరపురెడ్డి రామకృష్ణ, ముత్యాల వీర అప్పారావు,మార్గాని సురేష్, వట్టికూటి కృష్ణ వేణి, మార్గాని బుజ్జి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో ఒక లబ్ధిదారురాలు ఏర్పాటు చేసుకున్న వీ లక్ష్మి కిరాణా అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ దుకాణాన్ని ఎంపీ భరత్ తదితర వైసీపీ నేతలు సందర్శించి అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *