-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-58 వ డివిజన్ 241 వ వార్డు సచివాలయ పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. శుక్రవారం 58 వ డివిజన్ 241 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందిరా నాయక్ నగర్లో విస్తృతంగా పర్యటించి.. 166 గడపలను సందర్శించారు. తొలుత వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా అన్నివర్గాల ప్రజలను పేరుపేరునా పలకరించారు. జగనన్న సంక్షేమ పథకాల వల్ల ఆయా కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అధికారులు, ప్రభుత్వ సిబ్బందిలో జవాబుదారీతనాన్ని మరింత పెంచిందని మల్లాది విష్ణు అన్నారు. స్థానిక సమస్యల సత్వర పరిష్కారంలో ఈ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని చెప్పారు. అలాగే అభ్యంతరం లేని ఆక్రమిత భూముల్లో 150 గజాలలోపు ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం సంతోషదాయకమన్నారు. ఈ నిర్ణయంతో నియోజకవర్గంలో దాదాపు 5వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని.. జీవో విడుదలైన వెనువెంటనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలియజేశారు.
చెత్త సేకరణ వాహనాల ప్రారంభం
పరిసరాల పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. స్వచ్ఛ విజయవాడ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 10 చెత్త సేకరణ ట్రాలీలను నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తడి చెత్త, పొడి చెత్త మరియు హానికర వ్యర్థ పదార్ధాలను వేర్వేరుగా సేకరించవలసిన ఆవశ్యకతపై గృహ యజమానులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, వీఎంసీ సంయుక్తంగా చేపడుతున్న కార్యక్రమాలతో డివిజన్లన్నీ సంపూర్ణ ఆరోగ్యకర ప్రాంతాలుగా విరజిల్లుతున్నాయని మల్లాది విష్ణు అన్నారు. అలాగే ప్రతిఒక్కరూ వ్యక్తిగతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగస్వామ్యం పంచుకుంటే నగరం మరింత సుందరీకరణ దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు.
చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారు
పాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు అమరావతి కూడా బాగుండాలన్నదే వైఎస్సార్ సీపీ సర్కారు ఉద్దేశమన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షనేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. అసలు రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించడానికి ప్రధాన కారణం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం కాదా..? అని ప్రశ్నించారు. ఆనాడు చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్లే రాష్ట్ర విభజన జరిగిందని దుయ్యబట్టారు. మీ అసమర్థత, చేతగానితనం వల్ల ప్రత్యేక హోదా అటకెక్కి.. ప్యాకేజీ తెరపైకి వచ్చిందని నిప్పులు చెరిగారు. చంద్రబాబు కోరడంతోనే జాతీయ హోదా కలిగిన పోలవరం రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లోకి వచ్చి ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శించారు. పైగా ఐదేళ్లు కేంద్ర కేబినెట్లో మీ మంత్రులు ఉండి కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించలేకపోయినందుకు సిగ్గుపడాలన్నారు. తెలుగుదేశం గత ఐదేళ్ల పాలనలో అమరావతి పేరిట ఆర్భాటం తప్ప పనులు కనీసం పునాదులు కూడా దాటలేదని మల్లాది విష్ణు విమర్శించారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని.. పెద్దఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డారని, వేల ఎకరాల భూములను విదేశీ కంపెనీలకు దోచిపెట్టారని ఆరోపించారు. మరలా ఏ ముఖం పెట్టుకుని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా బురద చల్లుతారని.. ఐదేళ్లు ప్రజలను మభ్యపెట్టినందుకు చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, లక్కంరాజు సునీత, తోపుల వరలక్ష్మి, నేరెళ్ల శివ, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News