-ప్రాధాన్య కళాశాలల్లో వసతులన్నీ కల్పించండి
-ముఖ్యమంత్రి జగనన్న లక్ష్యాల మేరకు అందరూ పనిచేయాల్సిందే
-మార్చి నెలాఖరుకు నిర్మాణాలు పూర్తి కావాల్సిందే
-పుస్తకాలు, పరికరాలు అన్నీ సిద్ధం చేయండి
-ఫర్నీచర్ కొనుగోలుకు పీవోలు జారీ
-ఆ కళాశాలలపై నిరంతర పర్యవేక్షణ ఉండాల్సిందే
-ఏపీఎంఎస్ ఐడీసీ అధికారులదే బాధ్యత
-రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
-ప్రభుత్వ మెడికల్ కళాశాలల పురోగతిపై సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్ లో ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ మెడికల్ కళాశాలల పురోగతిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రారంభించాలనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మచిలీపట్టణం, ఏలూరు, విజయనగరం, నంద్యాల, రాజమండ్రి ప్రాంతాల్లో కచ్చితంగా వైద్య కళాశాలలు ప్రారంభం కావాలని, ఆ మేరకు ఆ ఐదు చోట్ల ప్రత్యేక చొరవ చూపించాలని స్పష్టం చేశారు. జాతీయ వైద్య మండలి నిబంధనల మేరకు ఈ ఐదు కళాశాలల్లో కావాల్సిన అన్ని వసతులను వచ్చే నెలాఖరులోగా సమకూర్చుకోవాలని ఆదేశించారు.
నియామకాలపై దృష్టి పెట్టండి
ఈ ఐదు కళాశాలలకు సంబంధించి అవసరమైన సిబ్బంది నియామకాలు మొత్తం వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. మరో 30 శాతం లోపు మాత్రమే ఆయా చోట్ల సిబ్బంది అవసరం ఉందని, వెంటనే ఆ ఖాళీలను కూడా భర్తీ చేయాలని సూచించారు. సివిల్ వర్కులు మొత్తం మార్చిలోగా పూర్తి చేయాలని ఏపీఎంఎస్ ఐడీసీ అధికారులను ఆదేశించారు. ఇకపై ప్రతి రోజూ ఈ ఐదు కళాశాలలపై పర్యవేక్షణ ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. తాను కూడా నిరంతరం పనుల పురోగతిపై సమీక్ష చేస్తానని చెప్పారు. నూతన కళాశాలలకు సంబంధించి లైబ్రరీల నిర్మాణం, వాటి కావాల్సిన ఫర్మిచర్, పుస్తకాలు, కళాశాలలకు కావాల్సిన వైద్య పరికరాలు, వాటి కొనుగోలు… ఇలా ప్రతి అంశంపై మంత్రి ఆరా తీశారు. వెంటనే ఆయా వసతులన్నీ ఏర్పాటుచేసుకోవాలని చెప్పారు. నిధుల సమస్య ఎక్కడా లేదని, వెంటనే కావాల్సినవన్నీ కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఎన్ ఎం సీ నిబంధనలకు అనుగుణంగా ప్రతి అంశం ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
పీజీ సీట్ల విషయంలో విజయం సాధించాం
పీజీ సీట్లను రాష్ట్రంలో గణనీయంగా పెంచుకునే విషయంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని మంత్రి విడదల రజిని తెలిపారు. 2019లో రాష్ట్రంలో మొత్తం 911 పీజీ సీట్లు ఉండేవని, ఇప్పుడు ఈ సీట్ల సంఖ్య ఏకంగా 1249 కు పెంచుకోగలిగామని, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితంగానే ఇది సాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా మరో 637 సీట్ల పెంపుదలకు ప్రయత్నిస్తున్నామని, ఆ ప్రయత్నంలో ఇప్పటివరకు 90 సీట్లను అదనంగా సాధించగలిగామని చెప్పారు. ఈ ఏడాది మొత్తం మీద కనీసం 500 పీజీ సీట్లను అదనంగా సాధించేలా ముందుకు సాగుతున్నామన్నారు. అధికారుల కృషి వల్లనే ఇది సాధ్యమైందని అభినందనలు తెలిపారు.
ఎన్ ఎంసీ అనుమతులు వచ్చేవరకు విశ్రమించొద్దు
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో ఐదు కొత్త మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభం కావాలనే లక్ష్యంతో ఉన్నారని, ఆ మేరకు ఆయా కళాశాలలకు ఎన్ ఎంసీ అనుమతులు వచ్చే వరకు అధికారులంతా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి విడదల రజిని తెలిపారు. ఆయా చోట్ల భవనాలు ఎట్టి పరిస్థితుల్లో సిద్ధం కావాలన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మరో నాలుగు గదులను ప్రాధాన్యతగా తీసుకుని త్వరలో పూర్తి చేయాలన్నారు. సిబ్బంది నియామకాలకు అవసరమైతే జాతీయస్థాయిలో నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలోని వైద్య విద్యార్థులకు ఎంతో మేలు చేసేలా తమ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని, ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరేలా అందరం కష్టపడి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, డీఎంఈ వినోద్‌కుమార్, డీఎంఈ ఇతర సిబ్బంది, ఏపీఎంఎస్ ఐడీసీ చీఫ్ ఇంజినీర్ కూనపరెడ్డి శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News