రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి “ప్రొ బోనో మరియు టెలీ లా స్కీమ్” మరియు “లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్, పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ (PLAPUS) విధి విధానాల” పై జిల్లా న్యాయ సేవధికార సంస్థ ప్యానల్ లాయర్లకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన ప్రజలకు ఉచిత న్యాయ సేవలను అందించడమే ప్రొ బోనో న్యాయ సేవల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సేవా భావం ఉన్న న్యాయవాదులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రొ బోనో న్యాయవాదులుగా నమోదు అయ్యి ప్రజలకు న్యాయ సేవలను అందించాలని కోరారు. న్యాయ స్థానాలు లేని మారుమూల గ్రామాల ప్రజలకు ఫోన్ కాల్ ద్వారా న్యాయ సలహాలు అందించడం కోసం టెలీ లా స్కీమ్ ఉపయోగ పడుతుందని అన్నారు. ప్రజలు పంచాయతీ కార్యాలయాల్లో ఉన్న కామన్ సర్విస్ సెంటర్ల ద్వారా లేదా ప్లే స్టోర్ నుండి టెలీ లా యాప్ డౌన్లోడ్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకుంటారని, ఆ సమయంలో న్యాయవాదులు కనీసం 20 నిమిషాల పాటు వారి సమస్యలు తెలుసుకుని తగిన న్యాయ సలహా ఇవ్వాల్సి ఉంటుందని తెలియ జేశారు. ముద్దాయిలకు, విచారణలో ఉన్న ఖైదీలకు సత్వరమైన మెరుగైన న్యాయ సేవలు అందించడమే లక్ష్యంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ పని చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలోని రవాణా, విద్యుత్, తపాలా, నీటి సరఫరా, మొదలగు వివాదాలను రాజీ మార్గం ద్వారా కానీ రాజీ జరగని పక్షంలో విచారణ చేసి తీర్పు వెలువరించడం ద్వారా కానీ పరిష్కరించేందుకు సంక్షిప్తీకరణ పని చేస్తుందని వివరించారు.
Prajavartha Online Telugu News