-తిరుపతిలో రైతు సాధికార సంస్థ రాష్ట్ర స్థాయి సమీక్ష
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
“ఎల్ నినో” ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున తక్కువ నీటి వినియోగంతో ఏడాదిపొడవునా పంటలు పండించే PMDS (Pre Monsoon Dry Sowing) ప్రకృతి వ్యవసాయ విధానాలు “ఎల్ నినో” కు సమాధానం కావాలని రైతు సాధికార సంస్థ సలహాదారులు డాక్టర్ రాయుడు సూచించారు. ప్రకృతి వ్యవసాయ ఫలితాలు “ఎల్ నినో” చూపే దుష్ప్రభావాలకు అతీతంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు “ఎల్ నినో” కారణంగా వచ్చే నష్టాలను ఎదుర్కొనడం ద్వారా ప్రకృతి వ్యవసాయ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని అన్నారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం చేయడం అత్యంత అవసరం అని, నేల ఆరోగ్యంతో పాటు ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటం కోసం రైతులందరూ ప్రకృతి వ్యవసాయంలో అడుగిడాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు సాధికార సంస్థ రెండు రోజుల పాటు తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్ లో (ఉదయ్ ఇంటర్నేషనల్ )రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమీక్షా సమావేశంలో రైతు సాధికార సంస్థ సీనియర్ కన్సల్టెంట్ లు, రీజనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ లు,సీనియర్థిమాటిక్ లీడ్ లు, థిమాటిక్ లీడ్ లు, సీనియర్ అధికారులు, అన్ని జిల్లాల ప్రాజెక్టు మేనేజర్లు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా శ్రీ డాక్టర్ రాయుడు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం అమలులో సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేసేలా జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. సత్ఫలితాలు సాదించాలంటే సిబ్బంది అంకితభావం చాలా అవసరం అన్నారు. జిల్లా స్థాయిలో సమీక్షా సమావేశం సమర్థవంతంగా జరగాలని, డీపీఎం (జిల్లా ప్రాజెక్టు మేనేజర్) లు ఇచ్చే సలహాలు, సూచనలు కింది స్థాయి సిబ్బంది వరకు చేరేలా జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. ప్రాజెక్టు లో పనిచేసే సిబ్బంది అందరూ తమ సొంత పొలాల్లో విత్తన దశ నుంచి విత్తన దశ వరకు పూర్తి విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించాలని అన్నారు.సిబ్బంది ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ నిత్య విద్యార్థి గా అనేక విషయాలను నేర్చుకోవలసి ఉంటుందని అన్నారు. రైతు సాధికార సంస్థ ఎంపిక చేసిన ఆదర్శ మండలాల్లో ప్రకృతు వ్యవసాయ కార్యక్రమాలు పకడ్బందీగా జరిగేలా చూడాలని సూచించారు. ఆదర్శ మండలాలలో తీర్చిదిద్దే ప్రకృతి వ్యవసాయ మాడల్స్ రైతులందరూ ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గుచూపేలా ఉండాలని స్పస్టం చేశారు.
ఈ సంధర్భంగా కోస్తా ప్రాంతీయ కో ఆర్డినేటర్ శ్రీ కృష్ణా రావు మాట్లాడుతూ రైతులలో ప్రకృతి వ్యవసాయంపై విస్తృత ప్రచారం కల్పించాలని, నిరంతర శిక్షణలు అవసరం అని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ విధానంలో సంపూర్ణ మార్పులు చోటుచేసుకోవలసిన అవసరం ఉందనే విషయాన్ని రైతులు గుర్తించాలని అన్నారు.ప్రకృతి వ్యవసాయం పై రైతులకు అవగాహన కల్పించడం అత్యంత ప్రాధాన్యం అని అన్నారు. రైతు సాధికార సంస్థ ప్రాంతీయ కో ఆర్డినేటర్ లు చంద్రశేఖర్ , ప్రకాష్ రావు, వెంకట్ రావు లు తమ పరిధిలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం అమలవుతున్న తీరును ఈ సంధర్భంగా వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో భాగంగా ఆదర్శ మండలాల ప్రణాళిక, విత్తన కిట్ ల తయారీ, పంపిణీ, PMDS (Pre Monsoon Dry Sowing) అమలు తీరు, మార్కెటింగ్ ప్రణాళిక, NPM (Non Pest Management) షాప్ ల నిర్వహణ, సామూహిక పౌష్టికాహార పెరటి తోటల ప్రగతి, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం, ఆరోగ్యం, పౌష్టికాహార విభాగపు కార్యక్రమాల అమలు, మోడల్ మేకర్ ల పనితీరు తదితర అంశాలపై జిల్లాల వారీగా క్షుణ్ణంగా డాక్టర్ రాయుడు గారు సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో రైతు సాధికార సంస్థ సీనియర్ కన్సల్టెంట్ లు శ్రీ జి. మురళీధర్, శ్రీమతి లక్ష్మిదుర్గ, శ్రీ నరేందర్, శ్రీ నాగిరెడ్డి, శ్రీ సురేందర్ రెడ్డి, సీనియర్థిమాటిక్ లీడ్ లు శ్రీ లక్ష్మా నాయక్, జాకీర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News