విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తల్లిదండ్రులపై ఆర్ధిక భారం పడకుండా ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదవాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కోట్లాది రూపాయల నిధులను కేటాయించి గ్లోబల్ ఎడ్యుకేషన్ అందించాలని విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం జరిగిందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శాసన సభ్యులు మల్లాది విష్ణు వర్ధన్ అన్నారు.
నగరంలోని సిద్దార్ధ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో శనివారం జరిగిన జగనన్న ఆణిముత్యాలు జిల్లా స్థాయి సన్మాన కార్యక్రమంలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శాసన సభ్యులు మల్లాది విష్ణు వర్ధన్, మాజి మంత్రివర్యులు శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంధర్బంగా శాసన సభ్యులు మల్లాది విష్ణు వర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తున్న విద్యార్థులకు అవార్డులు, పురస్కారాలు అందించేందుకు ప్రభుత్వం జగనన్న ఆణిముత్యాలతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అక్షర క్రమంలో ముందున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విద్యారంగంలోనూ దేశంలోనే మొదటిస్థానం లో ఉండేలా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చారన్నారు. సుమారు 62 వేల కోట్ల రూపాయాలకు పైగా నిధులతో నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలో మౌలిక వసతులను కల్పించడంతో పాటు జగనన్న గోరుముద్ద, అమ్మఒడి, జగనన్న విద్యాకానుక వంటి పలు పథకాలను ప్రవేశపెట్టి ప్రతి పేదవానికి కార్పొరేట్ విద్యను అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ పాఠశాలలను ప్రోత్సహించాయన్నారు. సామాన్యుడు సైతం ఉన్నత చదువులు చదువుకోవాలని తల్లిదండ్రులపై ఆర్ధిక భారం పడకుండా పలు పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా మూడు వేల పాఠశాలల్లో అత్యాధునిక వసతులు కల్పించామన్నారు. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ కల్పించిన తొలి రాష్ట్రం మనదేనని అన్నారు. విద్యారంగంలో తీసుకుంటున్న సమూల మార్పులకు నిదర్శనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరుతుండడం శుభపరిణామం అని శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్ అన్నారు.
మాజి మంత్రివర్యులు శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పదో తరగతి, ఇంటర్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనుపరచిన విద్యార్థులను జగనన్న ఆణిముత్యాల ద్వారా నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు, తల్లిదండ్రులను సన్మానించుకోవడం అభినందనీయమన్నారు. విద్యా ద్వారానే అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడీ భావించి విద్యారంగంలో పలు పథకాలను అమలు చేస్తున్నారన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకురావడం జరిగిందన్నారు. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తరగతి గదిలో ఫాన్స్, లైట్లు, ఫర్నిచర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించారన్నారు. ర్యాంకులు సాధించడంలో ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ పడుతున్నారని శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు.
జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ జగనన్న ఆణిముత్యాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరచిన 42 మంది విద్యార్థులలో 26 మంది బాలికలు ఉండటం గర్వించతగ్గ విషయమన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని సత్యనారాయణపురం ఎకెటిపిఎం పాఠశాలకు చెందిన విద్యార్థి నందెపు జోయల్ సుమన్ 590 మార్కులతో రాష్ట్రంలోనే 5వ ర్యాంక్ సాధించారన్నారు. గత 50 సంవత్సరాలుగా విద్యారంగానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదని నేటి రాష్ట్ర ముఖ్యంమత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య విధానంలో పలు సంస్కరణలు, మార్పులు తీసుకువచ్చి నిరుపేదలకు సైతం నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ప్రస్తుత సంస్కరణలు రానున్న రోజులలో సత్ఫలితాలిస్తాయన్నారు. నేడు సన్మానం అందుకున్న విద్యార్థులు భవిష్యత్తులోనూ ఇటువంటి సాధనను కొనసాగించి గొప్ప శాస్త్రవేత్తలు, వైద్యులు, విద్యావేత్తలుగా తయారుకావాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు విద్యార్థులకు సూచించారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విద్య రంగంలో పోటీతత్వం పెంచి ప్రతిభను గుర్తించేవిధంగా జగనన్న ఆణిముత్యాలు ప్రభావితం చేస్తాయన్నారు. ఎల్ కె జి నుండి పీజి వరకు ఉచిత విద్యను అందించి విద్య అనే తరగని ఆస్తిని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ప్రపంచ స్థాయిలో మన రాష్ట్ర విద్యార్థులు పోటీపడేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో భోధన అందిస్తున్నామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు.
కార్యక్రమంలో జిల్లా స్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి 50,000 రూపాయాలు, 30,000 రూపాయాలు, 15,000 రూపాయాల ప్రతిభ పురస్కారానికి పదో తరగతి పరీక్షల్లో 27 మంది, ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరంలో 15 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నగదు చెక్, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందించి ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్, జిల్లా విద్యాశాఖ అధికారి సీవి రేణుక, ఏపీ భట్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ కె. గీతాంజలి దేవి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి పుణ్యశీల, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ జమల పూర్ణమ్మ, గిరిజన సంక్షేమ అధికారి ఎం. రుక్మాంగదయ్య, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బి. ప్రవళిక ఉన్నారు.
Prajavartha Online Telugu News