-అమరావతి లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని ఇతర రాజకీయ పక్షాల తో కలిసి వామ పక్షాలు వ్యతిరేకించడం ఏవిధంగా అర్ధం చేసుకోవాలి?
-మెయిన్ మీడియా లో తప్పుడు,వక్రీకరించే వార్తల, వ్యక్తుల వాస్తవాలను గంటల వ్యవధిలో ప్రజల దృష్టికి తేవడంలో సోషల్ మీడియా చురుకుగా వ్యవహరిస్తోంది.
-సమాజాన్ని, ప్రభుత్వాలను ప్రభావితం చేసిన వార్తలు వ్రాయ గలగడం మానసికంగా సంతృప్తినిచ్చే అంశం.
– మాజీ మంత్రి, పూర్వ పాత్రికేయులు కురసాల కన్నబాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల కోసం ప్రజల ఎజెండా తోపని చేయడం పత్రికల ప్రధాన కర్తవ్యం అని మాజీ మంత్రి, పూర్వ పాత్రికేయులు కురసాల కన్నబాబు అన్నారు. సమస్య మూలం వెదికే పనికి బదులు సమస్య ను సృష్టించే పనులకు పత్రికలు పాల్పడడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సి.ఆర్. మీడియా అకాడమి ప్రతి శనివారం, వర్కింగ్ జర్నలిస్టులకు, జర్నలిజం విద్యార్థులకు నిర్వహిస్తూన్న ఆన్ లైన్ అవగాహన సదస్సులో భాగంగా ఈ శనివారం (17.06.23) “మాధ్యమాలు- ప్రజల ఎజెండా” అనే అంశం పై తమ అభిప్రాయాలను వెల్లడించారు. తమ స్వంత ఎజెండాను నిస్సిగ్గుగా ప్రకటించుకునేలా వార్తలు వంటి అసహజ ధోరణులు పత్రికా రంగంలో పెరిగిపోయాయని ఆయన అన్నారు. అనుకూలమైన ప్రభుత్వాలు అధికారంలో ఉంటే ఒక ఎజెండాతోను, లేకపోతె వేరొక ఎజెండా తోను వ్యవహరించడం కొన్ని పత్రికలకు అలవాటుగా మారిందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రతి వారం కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించే వామ పక్షాలు అమరావతి లో పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు యివ్వడాన్ని ఇతర రాజకీయపక్షాలతో కలిసి వ్యతిరేకించడం ఏవిధంగా అర్ధం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. నిజాలను మరుగు పరిచి, పత్రికవిధానాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా వార్తలను మలిచి ప్రచురించడం లోని ఔచిత్యాన్ని ఆయన దుయ్యబట్టారు. ఏ పత్రిక, ఎలెక్ట్రానిక్ మీడియా ఛానల్ ఎవరి ప్రయోజనాలకు పనిచేస్తున్నాయో ప్రజలకు స్పష్టమై పోయి వార్తల విశ్వసనీయత పడిపోయిందన్నారు.
పెరిగిన సాంకేతికత వల్ల సమాచార వ్యవస్థ ప్రజా జీవితంతో పెనవేసుకుపోయిన ప్రస్తుత తరుణంలో ఇటువంటి ధోరణులు సమాజానికి తీవ్ర హాని చేస్తాయన్న సంగతిని ఎవ్వరూ పట్టించుకోక పోవడం విచారకరమన్నారు. ఎండల తీవ్రత నానాటికి పెరిగిపోతూ, జూన్ నెల సగం గడిచినా, వ్యవసాయ పనులు ప్రారంభం కాకపోవడం పై కనీసం ఒక్క వార్త కూడా తాము పత్రికల్లో చూడలేదన్నారు. వ్యవసాయ పనులు ఒక నెల ఆలస్యం అయితే, వ్యవసాయ సీజన్ మారిపోయే ప్రమాదం ఉందని, ఈ తీవ్రతపై దృష్టి పెట్టకపోవడం సరైనది కాదన్నారు. పత్రికలు తమ స్వంత ఎజండాను కొంతైనా తగ్గించి ఈ విధమైన ప్రజల ఎజెండాకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. గడిచిన వారం రోజుల వార్తల్లో ప్రజల అవసరాలను ప్రతిబింబిచే వార్తలు ఎంత శాతం ఉన్నాయో పరిశీలిస్తే పత్రికలు ప్రజలకు బదులు తమ యాజమాన్యాల విధానాలకు ఏ మేరకు ప్రాధాన్యత యిస్తున్నాయో అందరికీ తెలుస్తుందన్నారు. ఏ లక్ష్యంతో పత్రికను నడుపుతున్నామో ఎవరికీ వారు సమీక్షించుకోవాలని ఆయన హితవు పలికారు.
ఎవరి నియంత్రణా లేకుండా సోషల్ మీడియా విపరీత ధోరణిలో నడుస్తోన్న విధానాన్ని ఆయన తప్పు పట్టారు. మెయిన్ మీడియా ఇటీవల అగ్రెస్సివ్ గ, తప్పులు, అస్లీల భాష వాడడం, అటువంటి భాష, భావజాలం వాడే వ్యక్తుల్ని ప్రోత్సహించడాన్ని సోషల్ మీడియా అనుసరిస్తూ, మరింత దుష్ట సంప్రదాయాలకు తెర తీస్తోండడం సభ్య సమాజాన్ని కలవర పరుస్తోందన్నారు. అయితే, మెయిన్ మీడియా లో తప్పుడు, వక్రీకరించే వార్తల, వ్యక్తుల వాస్తవాలను గంటల వ్యవధిలో ప్రజల దృష్టికి తేవడంలో సోషల్ మీడియా చురుకుగా వ్యవహరించడం ఒక మంచి పరిణామం అన్నారు. ఉదాహరణ గా ఒక పత్రికలో ఒక బిక్షమెత్తుకునే వ్యక్తి ఫోటోను అమరావతి ఉద్యమకారుడిగా చిత్రించిన విషయాన్ని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగ జారింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేసిన నిపుణుని గురించి వాస్తవాలను ఉన్నది వున్నట్లు సోషల్ మీడియా గంటల వ్యవధిలోనే ప్రజల ముందు వుంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కొత్తగా జర్నలిజం లో ప్రవేశించిన యువ జర్నలిస్టులు తమ పాత్రను తామే నిర్ధారించుకోవాలన్నారు. మేనేజ్ మెంట్ విధానాలను అనుసరిస్తూనే, తమకు సంతృప్తి కలిగేలా సామాజిక అంశాలను స్పృశించాలని సూచించారు. సమాజాన్ని, ప్రభుత్వాలను ప్రభావితం చేసిన వార్తలు వ్రాయ గలగడం మానసికంగా సంతృప్తినిచ్చే అంశం అన్నారు. పాత్రికేయ రంగంలో పనిచేసిన సందర్భంగా ప్రభావ వంతమైన ఆర్టికల్స్ వ్రాసిన సంతృప్తి తమకు, తమతో కల్సి పనిచేసిన ఎల్.వి.కె. రెడ్డి,లతో పాటు కొమ్మినేని శ్రీనివాసరావు వంటి సీనియర్లకు వుందని ఆయన అన్నారు.
Prajavartha Online Telugu News