గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కారణంగా ఏమైనా మార్పులు చేస్తే వాటి వివరాలను బిఎల్ఓల ద్వారా ఓటర్లకు తెలియచేస్తామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరి రివిజన్ 2024 పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడైనా పోలింగ్ కేంద్రాలను మార్చవలసి ఉంటే వాటిని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు, స్థానిక ఓటర్లకు తెలియచేస్తామన్నారు. బిఎల్ఓలు మార్చిన కేంద్రం పరిధిలోని ఓటర్లకు వివరించి, వారి నుండి సంతకాలు కూడా తీసుకోవాలని ఆదేశిస్తామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు, క్లైయిమ్స్ పై రాజకీయ పార్టీల ప్రతినిధుల అర్జీలు, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు తీసుకొని, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పట్టణ ప్రణాళిక అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను మరొకసారి పరిశీలించి, ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తెలియచేయాలని ఆదేశించారు. ఈ నెల 19 నుండి 25 వరకు తూర్పు నియోజకవర్గంలో 339, పశ్చిమ నియోజకవర్గంలో 510 వివిధ క్లైయిమ్స్ అందాయని, వాటిని బిఎల్ఓలు, సూపర్వైజరి అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేసిన నివేదిక మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ, అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ, ఏఈఆర్ఓలు ప్రదీప్ కుమార్, శ్రీనివాసరావు, సూపరిండెంట్లు ప్రసాద్, పద్మ, రాజకీయ పార్టీలైన టిడిపి నుండి ఓంకార్, వైఎస్సార్సీపి నుండి డి.జాని బాష, బిఎస్పి నుండి సిహెచ్.వాసు, బిజెపి నుండి పాండురంగ విఠల్, అమ్ ఆద్మీ నుండి సేవకుమార్, కాంగ్రెస్ నుండి డి.బాలాస్వామి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News